పసివాడి ప్రాణం... లెక్కలేని తనం | - | Sakshi
Sakshi News home page

పసివాడి ప్రాణం... లెక్కలేని తనం

Oct 9 2025 3:13 AM | Updated on Oct 9 2025 8:12 AM

పసివా

పసివాడి ప్రాణం... లెక్కలేని తనం

శిశువు పరిస్థితి విషమంగా ఉన్నా పట్టించుకోని శిశుగృహ సిబ్బంది

ప్రాణం కోల్పోయినా పట్టనట్లు వ్యవహరించిన డీఎంసీ కో–ఆర్డినేటర్‌

మరుసటి రోజు కూడా శిశుగృహలోకి అడుగుపెట్టని వైనం

అసలైన బాధ్యులు వీరేనని ఐసీడీఎస్‌ వర్గాల్లో చర్చ

అనంతపురం సెంట్రల్‌: పసివాడి ప్రాణమంటే వారికి లెక్కలేని తనం. తమను అడిగే వారు ఎవరు లేరన్న ధీమాతో ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకున్నారు. విషయం తెలుసుకున్న రాష్ట్ర ప్రజానీకం ‘ఎంత ఘోరం’ అని చర్చించుకుంటున్నా.. వారిలో కనీస పశ్చాత్తాపం కనిపించడం లేదు. పర్యవేక్షణ లోపం కారణంగా ఐసీడీఎస్‌ ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ ఎం.నాగమణిపై సస్పెన్షన్‌ వేటు వేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వ కార్యదర్శి సూర్యకుమారి... అసలైన బాధ్యులపై ఎలాంటి చర్యలకూ ఆదేశించకపోవడం ప్రస్తుతం జిల్లాలో హాట్‌ టాపిక్‌గా మారింది. శిశువు మృతికి శిశుగృహ మేనేజర్‌, మిషన్‌ వాత్సల్య కో ఆర్డినేటర్‌, మరికొందరి నిర్లక్ష్యం కూడా కారణమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ క్రమంలో ఈ నెల 3న అర్ధరాత్రి శిశుగృహలో ఏం జరిగిందనే అంశంపై ఆరా తీస్తే అత్యంత బాధాకరమైన అంశాలు వెలుగులోకి వస్తున్నాయి.

శిశుగృహలో అంతర్గత పోరు

సిబ్బంది మధ్య అంతర్గత పోరు కారణంగా కొంత కాలంగా శిశుగృహ అస్తవ్యస్తంగా మారింది. ఫలితంగా చిన్నారుల సంక్షేమాన్ని అక్కడి సిబ్బంది మరుగున పడేశారు. దీంతో ఆరోగ్యంగా ఉన్న చిన్నారులు కాస్త అనారోగ్యం బారిన పడుతున్నారు. ఇదే చిన్నారి నిరూప్‌ విషయంలోనూ జరిగింది. ఈ నెల 3న నిరూప్‌కు విరేచనాలయ్యాయి. బాధ్యతగా వైద్య చికిత్సలు అందించాల్సిన శిశుగృహ మేనేజర్‌ దీప్తి పట్టించుకోకపోవడంతో పాటు అదే రోజు రాత్రి శిశువుకు విధుల్లో ఉన్న ఆయా సక్రమంగా పాలు పట్టకపోవడంతో గుక్క పెట్టి ఏడ్చి ప్రాణాలు కోల్పోయాడు. దీంతో ఆందోళనకు గురైన ఆయా పరిస్థితిని వివరించడానికి పలుమార్లు ఫోన్‌ చేసినా మేనేజర్‌ స్పందించలేదు. దీంతో ఒంటరిగానే శిశువును తీసుకుని సర్వజనాస్పత్రికి వెళ్లినట్లు తెలుస్తోంది. అప్పటికే జరగాల్సిన ఘోరం జరిగిపోయింది.

మిషన్‌ వాత్సల్య కో ఆర్డినేటర్‌కు పట్టదా?

మహిళాశిశు సంక్షేమశాఖ పరిధిలోని శిశుగృహ, బాలసదనం, వన్‌స్టాప్‌ సెంటర్‌ తదితర విభాగాలను పర్యవేక్షించేందుకు ప్రభుత్వం తాజాగా మిషన్‌ వాత్సల్య జిల్లా కో ఆర్డినేటర్‌ను నియమించింది. ఐసీడీఎస్‌ ప్రాజెక్టు డైరెక్టర్‌ (పీడీ) సిఫారసు లేకుండానే తన పలుకుబడిని ఉపయోగించి ఉరవకొండ సీడీపీఓ శ్రీదేవి కో ఆర్డినేటర్‌గా అదనపు బాధ్యతలు తీసుకున్నారు. అయితే శిశుగృహలో ఎంతో ఆరోగ్యంగా ఉన్న శిశువు మృతి చెందితే బాధ్యత గల కో ఆర్డినేటర్‌ శ్రీదేవి ఏమాత్రం పట్టనట్లు వ్యవహరించడం విమర్శలకు తావిస్తోంది. 3వ తేదీ రాత్రి శిశువు మృతి చెందిన విషయం తెలిసినా... తనకేమీ పట్టనట్టు శ్రీదేవి ఈ నెల 4న బుక్కరాయసముద్రంలో ప్రభుత్వం నిర్వహించిన ‘ఆటో డైవర్‌ సేవలో’’ పథకం ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. మరుసటి రోజు తీరికగా శిశుగృహలోకి అడుగుపెట్టారు. శిశుగృహలో ఆశ్రయం పొందుతున్న శిశువు మరణిస్తే ఏది ప్రాధాన్యతో తెలుసుకోకుండా ప్రచార ఆర్బాటం కోసం ఆటో డ్రైవర్‌ సేవలో కార్యక్రమంలో పాల్గొనడం అనుమానాలకు తావిస్తోంది. మరుసటి రోజు కలెక్టర్‌ ఆనంద్‌ తీవ్రంగా స్పందించి విచారణకు ఆదేశించడంతో తీరిగ్గా అప్పుడు వెళ్లి ఎంతో బాధ్యత ఉన్నట్లుగా నటించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

సిబ్బంది నవ్వులాట

శిశువు మృతి విషయంలో మిషన్‌ వాత్సల్య కో ఆర్డినేటర్‌, శిశుగృహ సిబ్బంది వ్యవహరించిన తీరు ఎంతో బాధాకరమనిపిస్తోంది. త్రీమెన్‌ కమిటీ విచారణకు కలెక్టర్‌ ఆనంద్‌ ఆదేశించకమునుపు పర్యవేక్షణ బాధ్యతలు తీసుకున్న ఓ అధికారి పత్రికలలో కథనాలను చూసి ‘ఇలాంటివి మామూలే... వాళ్లు రాస్తాంటారు.. ఏమైతాది’ అని వ్యాఖ్యానించినట్లు ఐసీడీఎస్‌ వర్గాలు తెలిపాయి. ఏకంగా మహిళాశిశు సంక్షేమశాఖ డైరెక్టర్‌ వేణుగోపాలరెడ్డి అప్పటికప్పుడు విజయవాడ నుంచి బయలుదేరి జిల్లాకు చేరుకుని శిశుగృహలో విచారణ చేపడితే ఓ మహిళా ఉద్యోగి నవ్వినట్లు తెలిసింది. ఎందుకు నవ్వుతున్నావని డైరెక్టర్‌ ప్రశ్నించినట్లు సమాచారం. అంతేకాక మరుసటి రోజు ట్రైనీ కలెక్టర్‌ సచిన్‌ రహెర్‌ కూడా శిశుగృహలో విచారణ చేపట్టిన సమయంలో సదరు నవ్విన వ్యక్తి ఎవరని ఆరా తీసినట్లు సమాచారం. దీనిని బట్టి చూస్తే శిశుగృహ సిబ్బంది ఏ స్థాయికి దిగజారారో అర్థం చేసుకోవచ్చు. నిజంగా వారి కుటుంబసభ్యుల్లోని చిన్నారికి ఈ పరిస్థితి దాపురించి ఉంటే ఇలాగే వ్యవహరించే వారా అనే ప్రశ్నలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. శిశువు మృతికి అసలు కారకులైన వీరిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారనే చర్చ సర్వత్రా సాగుతోంది.

 

పసివాడి ప్రాణం... లెక్కలేని తనం 1
1/1

పసివాడి ప్రాణం... లెక్కలేని తనం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement