అనంతపురం: జర్నలిస్ట్ స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో అనంతపురంలోని ఆర్డీటీ క్రీడా మైదానం వేదికగా నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి జర్నలిస్ట్ క్రికెట్ లీగ్ పోటీల విజేతగా చిత్తూరు జట్టు నిలిచింది. బుధవారం తూర్పుగోదావరి, చిత్తూరు జిల్లా జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్‌ను జెడ్పీ చైర్‌పర్సన్ బోయ గిరిజమ్మ టాస్ వేసి ప్రారంభించారు. కార్యక్రమంలో జేశాప్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయ్‌కుమార్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెంకట రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి జగదీష్, జిల్లా అధ్యక్షుడు కె.రవితేజా, కమిటీ సభ్యులు కుళ్లాయప్ప, శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
మాంఛూను కలిసిన ఎమ్మెల్యేలు
ఆర్డీటీ ప్రోగ్రాం డైరెక్టర్ మాంఛూ ఫెర్రర్‌తో పలువురు ఎమ్మెల్యేలు సమావేశమయ్యారు. ఆర్డీటీకి ఎఫ్‌సీఆర్‌ఏ రెన్యువల్‌కు సంబంధించిన అంశాలపై చర్చించారు. మాంఛూ ఫెర్రర్‌ను కలిసిన ఎమ్మెల్యేల్లో జేసీ అస్మిత్‌రెడ్డి, పల్లె సింధూర రెడ్డి, ఎంఎస్ రాజు, అమిలినేని సురేంద్రబాబు, బండారు శ్రావణిశ్రీ, మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి ఉన్నారు.
పోలీసుల అదుపులో మాంత్రికుడు
పుట్టపర్తి అర్బన్: తమపై, తమ గ్రామస్తులపై చేతబడి చేస్తున్నారంటూ ఓ మాంత్రికుడిని బంధించి పోలీసులకు అప్పగించిన ఘటన కలకలం రేపింది. పుట్టపర్తి మండలం బడేనాయక్ తండాకు చెందిన ఆర్మీ జవాన్ వినోద్‌నాయక్ తెలిపిన మేరకు... జవాన్ కుటుంబం, ఇతరులపై కక్షగట్టిన అదే గ్రామానికి చెందిన బాలకృష్ణ, లక్ష్మీరాం, చంద్రకళ, జయాబాయి.. అనంతపురం జిల్లా గుత్తికి చెందిన మాంత్రికుడు విరూపాక్షను సంప్రదించి క్షుద్ర పూజలు చేయించారు. బుధవారం జవాన్ కుటుంబసభ్యుల ఫొటోలు, వంశవృక్షం ఉంచి నిమ్మకాయలు మంత్రిస్తూ క్షుద్రపూజలు చేస్తుండగా వినోద్‌నాయక్ గుర్తించి అడ్డుకున్నాడు. అనంతరం మాంత్రికుడిని పోలీసులకు అప్పగించాడు. ఈ విషయంపై ఎస్‌ఐ లింగన్నను వివరణ కోరగా విరూపాక్షపై గతంలో పలు కేసులు ఉన్నాయని తెలిసిందన్నారు. దీంతో విరూపాక్షతో పాటు మరో నలుగురిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నామన్నారు.
జ్యోతిష్కుడిపై ఫిర్యాదు
అనంతపురం: నగరంలోని కమలానగర్‌లో జ్యోతిష్య కేంద్రం నిర్వాహకుడు తనను మోసం చేసి రూ.లక్షలు వసూలు చేసుకున్నాడంటూ పోలీసులకు ఓ బాధితురాలు ఫిర్యాదు చేసింది. అనంతరం మీడియాకు వివరాలు వెల్లడించింది. అనంతపురంలో నివాసముంటున్న వివాహిత ఫరీదా భర్త తాగుడుకు బానిసయ్యాడు. వ్యసనాన్ని మాన్పించేందుకు ఆమె చేయని ప్రయత్నమంటూ లేదు. ఈ క్రమంలోనే కమలానగర్‌లో ఉన్న చాముండేశ్వరి దేవి జ్యోతిష్యాలయం నిర్వహకుడు దుర్గాప్రసాద్ శాస్త్రిని సంప్రదించింది. తాగుడు మాన్పిస్తానని, నర దృష్టి లేకుండా చేస్తానని నమ్మబలకడంతో జనవరి నెల నుంచి ఫోన్ పే ద్వారా రూ.1.50 లక్షలు, మరో రూ.2 లక్షలను నగదు రూపంలో మొత్తం రూ.3.50 లక్షలను ఫరీదా చెల్లించింది. అనంతరం ఫరీదా భర్తలో మార్పు రాలేదు కానీ ఇంట్లో గొడవలు మొదలయ్యాయి. దీంతో డబ్బును వెనక్కు ఇవ్వాలని బాధితురాలు నేరుగా వెళ్లి జ్యోతిష్కుడిని అడిగినా ఫలితం లేకపోయింది. దీంతో తాను మోసపోయినట్లుగా నిర్ధారించుకున్న ఆమె బుధవారం వన్‌టౌన్ పీఎస్‌లో ఫిర్యాదు చేసింది.