
మొదలైన పంట కోత ప్రయోగాలు
అనంతపురం అగ్రికల్చర్: ఖరీఫ్ పంట కోత ప్రయోగాలు మొదలయ్యాయి. సాగు చేసిన పంటల్లో దిగుబడులు అంచనా వేయడానికి ప్రణాళిక, వ్యవసాయ శాఖల ఆధ్వర్యంలో పంట కోత ప్రయోగాలు చేపట్టారు. కొన్ని పంటలకు దిగుబడుల ఆధారంగా ఫసల్‌బీమా పరిహారం అందిస్తున్న నేపథ్యంలో ఈ ప్రయోగాలకు ప్రాధాన్యత నెలకొంది. మొత్తంగా 1,122 సీసీఈలు నిర్వహిస్తుండగా ఇందులో గ్రామం యూనిట్‌గా కందికి ఫసల్‌బీమా వర్తింపజేస్తూ అత్యధికంగా 846 ప్రయోగాలు చేపట్టనున్నారు. అలాగే వరిలో 96, జొన్నలో 36, మొక్క జొన్నలో 72, ఆముదంలో 36, ఎండుమిరపలో 36 పంట కోత ప్రయోగాలు చేపట్టనున్నారు. ఇవి కాకుండా వాతావరణ బీమా వర్తింపజేసిన వేరుశనగ, పత్తితో పాటు సజ్జ, కొర్ర పంటల్లోనూ కొన్ని ప్రయోగాలు చేపట్టి దిగుబడులను అంచనా వేయనున్నారు. అటు శ్రీసత్యసాయి జిల్లాలోనూ అత్యధికంగా కందిలో 720 పంట కోత ప్రయోగాలు, మొక్కజొన్నలో 84, వరిలో 36, రాగిలో 26, ఆముదంలో 26 పంట కోత ప్రయోగాలు చేపట్టనున్నారు. ఈ క్రమంలో బుధవారం అనంతపురం రూరల్ మండలం ఇటుకలపల్లి గ్రామంలో రైతు అంకె బాలపెద్దన్న సాగు చేసిన వేరుశనగ పంటలో దిగుబడులు అంచనా వేసేందుకు ప్రయోగం నిర్వహించారు. 5 ఇంటు 5 అడుగుల చుట్టు కొలతల ప్లాట్ నుంచి 2.700 కిలోల దిగుబడి వచ్చినట్లు ఏఓ వెంకటకుమార్, ఏఈఓ మురళీకృష్ణ తెలిపారు.