
కరిగిపోయినా.. కళ్లప్పగించి చూస్తూ!
అనంతపురం అర్బన్: కూటమి ప్రభుత్వ పాలనలో పేదలకు పంపిణీ చేయాల్సిన బియ్యం కూడా ఉమ్మడి జిల్లాకు సకాలంలో సరఫరా కావడం లేదు. ఇటు సర్కారుకు... అటు అధికారులకు ముందస్తు ప్రణాళిక లేకపోవడంతో ఇలాంటి దుస్థితి ఏర్పడుతోంది. ఈ క్రమంలో ఏ మాత్రం తేడాలొచ్చినా ప్రజా పంపిణీ వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడుతుంది. అంతిమంగా లబ్ధిదారులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. మరో వారం రోజుల్లో ఎంఎల్‌ఎస్ పాయింట్లకు బియ్యం రవాణా కావాల్సి ఉన్న తరుణంలో... అనంతపురం రూరల్ మండలంలోని కందుకూరు వద్ద ఉన్న గిడ్డంగుల్లో బియ్యం నిల్వలు 996 టన్నులు మాత్రమే ఉండడం ఆందోళన కలిగిస్తోంది.
ఎంఎల్‌ఎస్ పాయింట్లకు రవాణా
ఉమ్మడి జిల్లాలోని 24 ఎంఎల్‌ఎస్ పాయింట్లకు కందుకూరు వద్ద ఉన్న గిడ్డంగుల నుంచి 19,500 టన్నుల బియ్యం రవాణా అవుతుంది. శ్రీ సత్యసాయి జిల్లాకు నెలసరి 10 వేల టన్నులు, అనంతపురం జిల్లాలోని 12 ఎంఎల్‌ఎస్ పాయింట్లలో 6 పాయింట్లకు ఇక్కడి నుంచి 5 వేల టన్నులు, మరో 6 పాయింట్లకు గుంతకల్లులోని గోడౌన్ నుంచి 4,500 టన్నులు రవాణా చేస్తారు.
అడుగంటిన నిల్వలు..
వాస్తవంగా ప్రతి నెలా 15లోపు ఎంఎల్‌ఎస్ పాయింట్లకు బియ్యం రవాణా చేస్తే అక్కడి నుంచి 30వ తేదీలోపు చౌక దుకాణాలకు చేరవేస్తారు. ఒకటో తేదీ నుంచి లబ్ధిదారులకు బియ్యం పంపిణీ ప్రారంభమవుతుంది. ఎలాంటి ఇబ్బందికర పరిస్థితి వచ్చినా ప్రజా పంపిణీ వ్యవస్థకు ఆటంకం రాకూడదనే ఉద్దేశంతో గోదాముల్లో కనీసం ఒక నెలకు సరిపడా బియ్యం నిల్వలు అందుబాటులో ఉంచుతారు. అయితే ప్రస్తుతం కందుకూరు వద్ద ఉన్న గిడ్డంగుల్లో 996 టన్నులు మాత్రమే ఉండడం గమనార్హం. ఉమ్మడి జిల్లాలోని ఎంఎల్‌ఎస్ పాయింట్లకు 15 వేల టన్నుల బియ్యం రవాణా ప్రక్రియను ఇప్పటికే మొదలు పెట్టాల్సి ఉన్నా బియ్యం స్టాక్ లేని కారణంగా ప్రారంభం కాలేదు.
వచ్చినా జాప్యం తప్పదు...
బియ్యం స్టాక్ మూడు రోజుల్లో గిడ్డంగులకు చేరుతుందని అధికారులు చెబుతున్నారు. అయితే, స్టాక్ వచ్చినా సరుకులను సకాలంలో రవాణా చేయడంలో ఇబ్బందులు తప్పేలా లేవు. అధికారులు చెబుతున్నట్లు 11వ తేదీకి సరుకు వస్తే 15వ తేదీలోపు ఎంఎల్‌ఎస్ పాయింట్లకు రవాణా చేయడం అంత సులభం కాదు. అక్కడి నుంచి 30వ తేదీలోపు చౌక దుకాణాలకు చేరవేయడంలోనూ జాప్యం తప్పదు. ఈ సమస్య నుంచి గట్టేందుకు అధికారులు ప్రత్యేక కార్యాచరణ చేపట్టకపోతే లబ్ధిదారులు ఇబ్బంది పడాల్సి వస్తుంది.
కందుకూరు గిడ్డంగుల్లో అడుగంటిన బియ్యం స్టాక్
15 వేల టన్నులకు ఉన్నది 966 టన్నులే
కనీసం నెల కోటా కూడా నిల్వ చేయని వైనం
స్టాక్ రాకపోతే లబ్ధిదారులపై తీవ్ర ప్రభావం