
రాజ్యమేలుతున్న నారా వారి కల్తీ మద్యం
అనంతపురం: నారా వారి కల్తీ మద్యం రాజ్యమేలుతోందని, రాష్ట్రాన్ని మద్యాంధ్ర ప్రదేశ్‌గా మార్చిన ఘనత సీఎం చంద్రబాబుకే దక్కుతుందని వైఎస్సార్‌సీపీ మహిళా, యువజన విభాగం నాయకులు ధ్వజమెత్తారు. యూరియా అందించకుండా రైతులను కష్టపెడుతున్న చంద్రబాబు.. మందుబాబులకు మద్యం మాత్రం ఎక్కడైనా అందిస్తున్నారంటూ మండిపడ్డారు. బుధవారం వైఎస్సార్ సీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు సాకే చంద్రశేఖర్, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు శ్రీదేవి ఆధ్వర్యంలో ఎకై ్సజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ కార్యాలయం వద్ద ఆందోళన నిర్వహించారు. మద్యం బాటిళ్లను కార్యాలయం ఎదుట పగులగొట్టి నిరసన తెలిపారు. కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ నాగమద్దయ్యకు వినతి పత్రం అందజేశారు. అనంతరం సాకే చంద్రశేఖర్ మాట్లాడుతూ ఏ పల్లెలో చూసినా బెల్ట్‌షాపులు దర్శనమిస్తున్నాయన్నారు. అధికారుల ప్రోత్సాహంతో మద్యం దుకాణదారులు రెచ్చిపోతున్నారన్నారు. ఎమ్మెల్యేలు సిండికేట్ కింగ్‌లుగా మారిపోయారన్నారు.రాష్ట్ర వ్యాప్తంగా మద్యం షాపులన్నీ అధికార పార్టీ నేతలకు చెందినవేనని గుర్తు చేశారు. కల్తీ మద్యం తయారీదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు శ్రీదేవి మాట్లాడుతూ.. కల్తీ మద్యం తయారీ గురించి తెలిసినా కట్టడి చేయకుండా సంబంధిత అధికారులు మొద్దునిద్ర పోతున్నారని, వారిని మేల్కొలిపేందుకే కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు. చంద్రబాబు ప్రభుత్వంలో విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు చేస్తుండడంతో మహిళలపై అఘాయిత్యాలు పెరిగాయని వాపోయారు. టీడీపీ నేతల కల్తీ మద్యం కారణంగా పేద, మధ్య తరగతి వర్గాల మహిళల తాళిబొట్లు తెగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు చెప్పిన సంపద సృష్టి ఇదేనా అంటూ మండిపడ్డారు. ప్రశ్నించేందుకే పార్టీ పెట్టానన్న డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ ఇప్పుడెందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి శివారెడ్డి, మహిళా విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి కృష్ణవేణి, మహిళా విభాగం జనరల్ సెక్రటరీలు పార్వతి, అంజలి,క్రిస్టియన్ మైనార్టీ రాష్ట్ర కార్యదర్శి జానీ, యువజన విభాగం ఉపాధ్యక్షులు వినీత్, ఉదయ్, యువజన విభాగం నగర జనరల్ సెక్రటరీ మసూద్ వలి, నగర కార్యదర్శి మైను, మహిళా నగరాధ్యక్షురాలు చంద్రలేఖ, ఎస్సీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి శోభ, వైఎస్సార్ ట్రేడ్ యూనియన్ జిల్లా కార్యదర్శి బి. అనిల్ కుమార్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
రైతుల కష్టాలు పట్టని సీఎం చంద్రబాబు..
మందుబాబులకు మాత్రం కావాల్సిన మద్యం అందిస్తున్నారు
వైఎస్సార్‌సీపీ మహిళా, యువజన విభాగం నాయకుల ధ్వజం