
తెగులు.. దిగులు
అనంతపురం అగ్రికల్చర్: ఖరీఫ్ పంటలను పురుగులు, తెగుళ్లు వ్యాపించి దెబ్బతీస్తున్నాయి. వేరుశనగలో కాండంకుళ్లు తెగులు, తిక్క ఆకుమచ్చ తెగులు ఆశించినట్లు రేకులకుంట వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్తలు చెబుతున్నారు. పత్తిలో రసం పీల్చుపురుగు, తెల్లదోమ, గులాబీ రంగు కాయతొలచు పురుగు ఆశించాయి. వరిలో ఆకుముడుత, ఆముదంలో నామాలపురుగు ఆశించి దెబ్బతీస్తున్నాయి. కందిలో మారుకామచ్చపురుగు, పచ్చపురుగు, పెసర, మినుములో మారుకాగూడు కట్టే పురుగు, మొక్కజొన్నలో కత్తెర పురుగు, మిరపలో తామరపురుగు, పచ్చపురుగు తదితర చీడపీడలు, తెగుళ్లు పంటలను దెబ్బతీస్తుండటంతో పిచికారీ ఖర్చులు పెరిగిపోయాయి. దిగుబడులపై కూడా తీవ్ర ప్రభావం చూపించే పరిస్థితి నెలకొంది.
పదును వర్షమే లేదు..
సరైన వర్షం లేక నెల రోజులవుతోంది. సెప్టెంబర్ 11 నుంచి ఉమ్మడి జిల్లాలో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. దాదాపు నెల రోజులు కావొస్తున్నా సరైన పదును వర్షం కురవలేదు. తేలికపాటి మినహా పెద్దగా వర్షాలు పడకపోవడంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పంటలు ఎండుముఖం పట్టాయి. అధిక ఉష్ణోగ్రతలు, ఆకాశం మేఘావృతం కావడం ఇలా మారిన వాతావరణ పరిస్థితుల్లో దాదాపు అన్ని పంటల్లో చీడపీడల వ్యాప్తి పెరిగింది. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
రబీ పంటల సాగుకు ఇబ్బంది
వేరుశనగ, కంది, ఆముదం, పత్తి, మొక్కజొన్న లాంటి వర్షాధార పంటలు తేమ లేక వాడిపోతున్నాయి. సెప్టెంబర్ సాధారణ వర్షపాతం 111.6 మి.మీ కాగా 87 మి.మీ వర్షం కురిసింది. ప్రస్తుత అక్టోబర్‌లో ఇంకా వరుణుడు బోణీ చేయలేదు. అక్టోబర్‌లో 100.9 మి.మీ సాధారణ వర్షపాతంగా గుర్తించినా ప్రస్తుతానికి కేవలం 2.3 మి.మీ నమోదు కావడం గమనార్హం. దీంతో అటు ఖరీఫ్ పంటలతో పాటు ఇటు రబీ పంటల సాగుకు కూడా ఇబ్బందికరంగా మారింది.
ఖరీఫ్‌లో దారుణంగా
ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి జిల్లాలో 3.43 లక్షల హెక్టార్లకు గానూ 88 శాతంతో 3.01 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో పంటలు వేశారు. అత్యధికంగా కంది 1.04 లక్షల హెక్టార్లు, వేరుశనగ 91 వేల హెక్టార్లు, పత్తి 26 వేల హెక్టార్లు, మొక్కజొన్న 29 వేల హెక్టార్లు, ఆముదం 16 వేల హెక్టార్లలో వేశారు. అటు శ్రీ సత్యసాయి జిల్లాలోనూ పరిస్థితి దారుణంగానే ఉంది. ఖరీఫ్‌లో 2.20 లక్షల హెక్టార్లకు గానూ 1.20 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో పంటలు సాగు చేశారు. అందులో 49 వేల హెక్టార్లలో వేరుశనగ, 27 వేల హెక్టార్లలో కంది, మొక్కజొన్న 23 వేల హెక్టార్లు, ఆముదం 5 వేల హెక్టార్లు, పత్తి 4 వేల హెక్టార్లలో సాగు చేశారు.