
పెండింగ్ పనులు పూర్తి చేయండి
● జేసీ శివ్ నారాయణ్ శర్మ ఆదేశం
అనంతపురం అర్బన్: మూడో విడత రీ–సర్వే పనులతో పాటు ప్రాజెక్టులకు భూసేకరణ ప్రక్రియలో పెండింగ్ పనులు సత్వరం పూర్తి చేయాలని జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ, అసైన్డ్ భూములను గుర్తించాలని సూచించారు. జేసీ బుధవారం కలెక్టరేట్‌లోని తన చాంబర్ నుంచి ఆర్డీఓలు, తహసీల్దార్లు, సర్వేయర్లు, వీఆర్‌ఓలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాటాడుతూ ప్రజల నుంచి భూ సమస్యలపై అందిన అర్జీల పరిష్కారానికి రెవెన్యూ, సర్వే అధికారులు సమన్వయంతో పని చేయాలన్నారు. భూమి రికార్డుల సవరణ, పెండింగ్‌లో ఉన్న మ్యుటేషన్ దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరించాలని ఆదేశించారు. ఈ విషయంలో అధికారులకు రైతులు సహకరించాలన్నారు. రీ–సర్వేలో కొత్త సమస్యలు ఉత్పన్నం కాకుండా చూడాలని చెప్పారు. రైల్వే, జాతీయ రహదారి, సోలార్ ప్రాజెక్టులకు సంబంధించి భూసేకరణ పూర్తి కావాలన్నారు. రాయదుర్గం, కళ్యాణదుర్గం, నరసాపురం, బెళుగుప్ప, డీ.హీరేహాళ్, ఓబుళాపురం, గుత్తి, బసినేపల్లి, గాంధీనగర్, చట్నేపల్లి, రైల్వే ఆర్‌ఓఆర్, తాడిపత్రి, గన్నేవారిపల్లిలో రైల్వే పనులు, గార్లదిన్నె, కనుంపల్లి ఏపీఐఐసీ పనులకు సంబంధించి భూమి సేకరించాలన్నారు. జాతీయ రహదారులు 544డీ, 42, 67లో పెండింగ్ పనులు, నష్ట పరిహారం చెల్లింపు పూర్తవ్వాలన్నారు. పెండింగ్‌లో ఉన్న కోర్టు కేసుల పరిష్కారానికి చొరవ చూపాలన్నారు. సమావేశంలో సర్వే భూ రికార్డుల శాఖ ఏడీ రూప్లానాయక్, భూ విభాగం తహసీల్దారు రియాజుద్ధీన్ తదితరులు పాల్గొన్నారు.