పొలాల్లో కేబుల్‌ అపహరణ | - | Sakshi
Sakshi News home page

పొలాల్లో కేబుల్‌ అపహరణ

Oct 8 2025 7:59 AM | Updated on Oct 8 2025 8:23 AM

యాడికి: మండలంలోని చందన గ్రామంలో వ్యవసాయ బోరుబావుల మోటార్లకు అనుసంధానం చేసిన విద్యుత్‌ తీగలను దుండగులు అపహరించారు. గ్రామ సమీపంలో తమకున్న పొలాల్లో రైతులు మల్లేసు, మోహన్‌బాబు గౌడ్‌, ఆది, పరమేశ్వర, లక్ష్మన్న అరటి పంటను సాగుచేశారు. ఐదుగురు రైతుల బోరుబావులకు ఏర్పాటు చేసిన 70 మీటర్ల కేబుల్‌ను సోమవారం రాత్రి దుండగులు కత్తిరించి తీసుకెళ్లారు. మంగళ వారం ఉదయం విషయాన్ని గుర్తించిన రైతులు లబోదిబో మంటూ పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమయ్యారు.

రాష్ట్ర స్థాయి కబడ్డీ విజేత ‘ప్యాపిలి’

గుత్తి రూరల్‌: మండలంలోని తొండపాడు గ్రామంలో వాల్మీకి జయంతి సందర్భంగా నిర్వహించిన రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీల్లో విజేతగా నంద్యాల జిల్లా ప్యాపిలి జట్టు నిలిచింది. మంగళవారం ఉదయం జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌లో గుంతకల్లు మండలం కదిరిపల్లి, ప్యాపిలి జట్లు హోరాహోరీగా తలపడ్డాయి. ఉత్కంఠ పోరులో చివరకు ప్యాపిలి జట్టు గెలుపొందింది. రన్నరప్‌ను కదిరిపల్లి జట్టు కై వసం చేసుకుంది. మూడో స్థానంలో గుంటూరు, నాల్గో స్థానంలో గుత్తి మండలం వన్నేదొడ్డి జట్లు నిలిచాయి. విజేత జట్లను అభినందిస్తూ టీడీపీ నేత గుమ్మనూరు ఈశ్వర్‌ నగదు పురస్కారాలతో సత్కరించారు.

మృతుడి ఆచూకీ లభ్యం

గుత్తి: స్థానిక జీఆర్పీ పరిధిలోని తురకపల్లి సమీపంలో సోమవారం తెల్లవారుజామున రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న గుర్తు తెలియని వ్యక్తి ఆచూకీ లభ్యమైంది. మృతుడిని గుత్తిలోని బండగేరికి చెందిన చాకలి సుబ్రహ్మణ్యం (35)గా గుర్తించారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కాగా, ఆత్మహత్యకు కారణాలు తెలియాల్సి ఉంది. ఘటనపై రైల్వే పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

ప్రమాదంలో వ్యక్తికి గాయాలు

యాడికి: జిల్లా కేంద్రంలో సోమవారం రాత్రి 10 గంటల సమయంలో చోటు చేసుకున్న ప్రమాదంలో యాడికి వాసి శ్రీనివాసులు తీవ్రంగా గాయపడ్డాడు. కుటుంబపోషణకు ప్రింటింగ్‌ ప్రెస్‌ నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్న శ్రీనివాసులు సోమవారం సాయంత్రం అనంతపురానికి వెళ్లాడు. ప్రింటింగ్‌ ప్రెస్‌కు అవసరమైన సామగ్రిని కొనుగోలు చేసి బస్టాండ్‌కు నడుచుకుంటూ వెళుతుండగా శరవేగంగా దూసుకొచ్చిన ద్విచక్ర వాహనం ఢీకొంది. ఘటనలో శ్రీనివాసులు కాలికి తీవ్ర గాయమైంది. స్థానికులు వెంటనే ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం బెంగళూరుకు కుటుంబసభ్యులు తీసుకెళ్లారు.

డీఐఓ డాక్టర్‌ యుగంధర్‌కు పదోన్నతి

అనంతపురం మెడికల్‌: జిల్లా వైద్య ఆరోగ్యశాఖలో డీఐఓగా విధులు నిర్వర్తిస్తున్న డాక్టర్‌ యుగంధర్‌కు పదోన్నతి దక్కింది. మచిలీపట్నం డీఎంహెచ్‌ఓగా ఆయనను నియమిస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా ఆయనకు డీఎంహెచ్‌ఓ కార్యాలయ ఉద్యోగులు అభినందించారు.

పొలాల్లో కేబుల్‌ అపహరణ 1
1/2

పొలాల్లో కేబుల్‌ అపహరణ

పొలాల్లో కేబుల్‌ అపహరణ 2
2/2

పొలాల్లో కేబుల్‌ అపహరణ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement