
‘కరివేపాకు’పై ఉద్యాన కమిషనర్ ఆరా
తాడిపత్రి రూరల్: జిల్లాలో కరివేపాకు పంట సాగుపై రాష్ట్ర ఉద్యాన కమిషనర్ శ్రీనివాసులు ఆరా తీశారు. ‘ఫ్యాక్షన్ గతిని మార్చిన కరివేపాకు’ శీర్షికన మంగళవారం ‘సాక్షి’లో వెలువడిన కథనం తెలిసిందే. దీనిపై స్పందించిన కమిషనర్.. మంగళవారం ఉదయం జిల్లా ఉద్యానాధికారి ఉమాదేవికి ఫోన్ చేసి సమగ్ర వివరాలను అందించాలని ఆదేశించారు. దీంతో కరివేపాకు పంట సాగుపై పూర్తి వివరాలు, రైతుల విజయాలపై పూర్తి స్థాయి సమచారం సేకరించి ఇవ్వాలంటూ తాడిపత్రి ఉద్యాన అధికారి ఉమాదేవికి డీహెచ్‌ఓ సూచనలు జారీ చేశారు. దీంతో వివరాల సేకరణలో తాడిపత్రి ఉద్యాన అధికారి నిమగ్నమయ్యారు. ఫ్యాక్షన్ ప్రభావిత గ్రామాన్ని కరివేపాకు పంట సాగు మార్చిన తీరుపై ఇతర ప్రాంతాల్లోని రైతులకు మార్గదర్శకంగా ఉండేలా ఓ డాక్యుమెంటరీని తీయనున్నట్లు సమాచారం.
గ్రామాల్లో జెడ్పీ సీఈఓ పర్యటన
బొమ్మనహాళ్: మండలంలోని ఉంతకల్లు, నేమకల్లు గ్రామాల్లో జెడ్పీ సీఈఓ శివశంకర్ మంగళవారం పర్యటించారు. ఉంతకల్లులో చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాన్ని పరిశీలించి, అక్కడ చేపట్టాల్సిన కార్యాచరణపై పలు సూచనలు చేశారు. గ్రామంలో ఇంటింటా చెత్త సేకరణ విధానాన్ని నేరుగా ప్రజలతో ఆరా తీశారు. నేమకల్లులో చేపట్టిన అభివృద్ది పనులను తనిఖీ చేశారు. రూ.2.10 కోట్ల వ్యయంతో 50 సీసీ రోడ్లు మంజూరయ్యాయి. ఇప్పటి వరకూ 32 పనులు పూర్తి చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీడీఓ విజయభాస్కర్, పీఆర్ జేఈఈ జగదీష్, పంచాయతీ కార్యదర్శులు శివన్న, పల్లవి, చిన్న యల్లప్ప, రాధాకృష్ణ పాల్గొన్నారు.
కొనసాగుతున్న వైద్యుల సమ్మె
అనంతపురం మెడికల్: పీహెచ్‌సీ వైద్యుల సమ్మె కొనసాగుతోంది. మంగళవారం డీఎంహెచ్‌ఓ కార్యాలయం ఆవరణలో ఏపీ పీహెచ్‌సీ వైద్యుల అసోసియేషన్ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అసోసియేషన్ నాయకులు మాట్లాడుతూ.. క్లినికల్ పీజీ సీట్లను 30 నుంచి 15 శాతానికి, నాన్ క్లినికల్ సీట్లను 50 నుంచి 30 శాతానికి తగ్గించడంతో పీహెచ్‌సీ వైద్యులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. కార్యక్రమంలో వైద్యుల సంఘం నాయకులు మనోజ్, డాక్టర్ సంధ్య, డాక్టర్ శివసాయి, డాక్టర్ ఆసియా, డాక్టర్ ప్రీతి, డాక్టర్ పరమేష్, తదితరులు పాల్గొన్నారు.

‘కరివేపాకు’పై ఉద్యాన కమిషనర్ ఆరా