కూడేరు: మండలంలోని పెన్నహోబిలం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ (పీఏబీఆర్) నిండు కుండలా దర్శనమిస్తోంది. మంగళవారం నాటికి 5.157 టీఎంసీలకు నీటిమట్టం చేరినట్లు డ్యాం డీఈ వెంకటరమణ తెలిపారు. తుంగభద్ర జలాశయం నుంచి హెచ్చెల్సీ ద్వారా 185 క్యూసెక్కులు, జీడిపల్లి జలాశయం నుంచి హంద్రీ–నీవా కాలువ ద్వారా 510 క్యూసెక్కుల చొప్పున నీరు వచ్చి చేరుతున్నట్లు వివరించారు. డ్యాంలో ఏర్పాటైన జల విద్యుత్ కేంద్రం ద్వారా విద్యుత్ ఉత్పత్తికి 585 క్యూసెక్కులు విడుదల చేస్తున్నట్లు పేర్కొన్నారు. అనంతపురం, శ్రీసత్యసాయి, శ్రీరామరెడ్డి, ఉరవకొండ, కూడేరు తాగునీటి ప్రాజెక్టులకు 55 క్యూసెక్కులు, లీకేజీ రూపంలో 35 క్యూసెక్కులు, నీటి ఆవిరి రూపంలో 25 క్కూసెక్కుల అవుట్ ఫ్లో ఉందన్నారు.
రసాయనిక ద్రావకం తాగి మేకల మృతి
పుట్లూరు: రసాయనిక ద్రావకం తాగి 20 మేకలు మృతి చెందాయి. స్థానికులు తెలిపిన మేరకు... పుట్లూరు మండలం కొండుగారికుంట గ్రామానికి చెందిన రాజశేఖర్, బయన్న.. మేకల పోషణ ద్వారా జీవనం సాగిస్తున్నారు. మంగళవారం ఉదయం మేకలను మేపు కోసం సమీప పొలాల వద్దకు తీసుకెళ్లిన సమయంలో దాహం వేసి పండ్ల తోటలకు డ్రిప్పుల ద్వారా సరఫరా చేసేందుకు డ్రమ్ముల్లో ఉంచిన రసాయన ద్రావకాన్ని తాగాయి.
అయితే మేకలు నీటిని తాగాయని భావించిన కాపరులు వాటిని సమీపం కొండల వద్దకు తోలుకెళుతుండగా ఒక్కొక్కటిగా 20 మేకలు మృతి చెందాయి. కాపరుల నుంచి సమాచారం అందుకున్న పశువైద్యాధికారుల అక్కడకు చేరుకుని పరిశీలించారు. మేకల కళేబరాలకు ఇన్‌చార్జ్ పశువైద్యాధికారి నాగసువర్ణ పోస్టుమార్టం నిర్వహించి, నివేదిక సిద్ధం చేశారు.

నిండుకుండలా పీఏబీఆర్