
వాల్మీకి మహర్షి జీవితం ఆదర్శప్రాయం
● జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ బోయ గిరిజమ్మ, ఎమెల్సీ మంగమ్మ
అనంతపురం రూరల్: వాల్మీకి మహర్షి జీవితం నేటి సమాజానికి ఆదర్శ ప్రాయమని జిల్లా పరిషత్ చైర్ పర్సన్ బోయ గిరిజమ్మ, ఎమ్మెల్సీ మంగమ్మ అన్నారు. వాల్మీకి జయంతి సందర్భంగా మంగళవారం అనంతపురం పాతూరులోని పవర్ ఆఫీస్ వద్ద ఉన్న వాల్మీకి విగ్రహానికి వారు పూలమాలలు వేసి, నీరాజనాలు సమర్పించారు. అనంతరం స్థానిక వాల్మీక కల్యాణ మంటపంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడారు. రామాయణాన్ని మహా అద్భుత కావ్యంగా మలచి మానవ జాతిని సన్మార్గంలో నడిపిన మహోన్నత వ్యక్తి వాల్మీకి మహర్షి అన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హమీ మేరకు వాల్మీకి, బోయలను ఎస్టీ జాబితాలో చేర్చాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నగర మేయర్ వసీం, డీసీసీబీ మాజీ చైర్మన్ పామిడి వీరా, బీసీ సంక్షేమశాఖ డిప్యూటీ డైరెక్టర్ కుష్బూకొఠారి, తదితరులు పాల్గొన్నారు.
వాల్మీకి విగ్రహానికి నివాళులు
పాతూరు పవర్ ఆఫీస్ వద్ద ఉన్న వాల్మీకి విగ్రహానికి రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, జేసీ శివ్‌నారాయణ్‌శర్మ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బోయ, వాల్మీకుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.