
టీడీపీ కండువాలు కప్పుకున్న వారితో సీఐ రాజు
తీవ్ర వివాదాస్పదమైన కూడేరు సీఐ తీరు
కూడేరు: కూడేరు అప్‌గ్రేడ్ పోలీసు స్టేషన్‌ను సీఐ రాజు టీడీపీ కార్యాలయంగా మార్చేశారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పోలీసుస్టేషన్‌ను ఆయన ‘పచ్చ’గా మార్చిన తీరు తీవ్ర వివాదాస్పదమవుతోంది. వివరాలు.. కూడేరు మండలం ముద్దలాపురంలో వారం క్రితం వైఎస్సార్ సీపీ సానుభూతిపరులైన పూజారి వెంకటేష్, పూజారి ధనుంజయ, పూజారి రమేష్ కుటుంబాలతో టీడీపీ కార్యకర్త జాఫర్ వలీకి ఇంటి ముందు దారి విషయమై గొడవ జరిగింది. దీనిపై జాఫర్ వలి కూడేరు పోలీసుస్టేషన్‌లో కేసు పెట్టాడు.
ఈ క్రమంలోనే పోలీసులు వైఎస్సార్ సీపీ సానుభూతిపరులను స్టేషన్‌కు పిలిపించి ఇబ్బందులకు గురిచేశారు. టీడీపీ కండువా వేసుకుంటే సమస్యలుండవని సీఐ రాజు చెప్పినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో సోమవారం ఆ మూడు కుటుంబాలకు చెందిన వారికి అనంతపురంలో టీడీపీ నేత పయ్యావుల శీనప్ప సమక్షంలో ‘పచ్చ’ కండువాలు వేయించారు. అనంతరం అక్కడి నుంచి వారిని ముద్దలాపురం గ్రామానికి చెందిన టీడీపీ నేతలు నేరుగా కూడేరు పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లారు. వారితో సీఐని సన్మానింపజేయడమే కాకుండా స్టేషన్‌లోనే కేక్ కట్ చేసి సంబరాలు చేయించడం సర్వత్రా చర్చనీయాంశమైంది.
మొన్నటి వరకు వైఎస్సార్ సీపీ సానుభూతిపరులపై కస్సు బుస్సుమన్న సీఐ రాజు కండువా మారగానే సంతోషంగా వారితో ఫొటోలు దిగడం వివాదాస్పమైంది. హుందాగా వ్యవహరిస్తూ ప్రజలకు మేలు చేయాల్సిన స్థానంలో ఉన్న అధికారి.. ఒక పార్టీకి కొమ్ము కాస్తూ వైఎస్సార్ సీపీ శ్రేణులను భయభ్రాంతులకు గురి చేయడమేమిటంటూ సామాన్యులు మండిపడుతున్నారు.