
గౌరమ్మ పండుగ.. భక్తిభావం నిండుగా
రాప్తాడు: తెలంగాణలో బతుకమ్మ పండుగను ఎంత ఘనంగా జరుపుకుంటారో.. జిల్లాలో అదే రీతిలో గౌరమ్మ ఉత్సవాలను వైభవంగా జరుపుకుంటారు. అందులో భాగంగా రాప్తాడు మండలంలోని పాలచెర్ల, భోగినేపల్లి, ఎం. బండమీదపల్లి, బుక్కచెర్ల, గొందిరెడ్డిపల్లి, యర్ర గుంట, పుల్లలరేవు, హంపాపురం, గాండ్లపర్తి తదితర గ్రామాల్లో గౌరమ్మ పండుగను ఘనంగా నిర్వహించారు. మూడు రోజులుగా అమ్మవారి విగ్రహాలకు ప్రత్యేక పూజలు చేసిన గ్రామస్తులు.. సోమవారం నిమజ్జనోత్సవాన్ని కనులపండువగా చేపట్టారు. ఈ సందర్భంగా యువతులు, చిన్నారులు, మహిళలు సంస్కృతీ సంప్రదాయాలకు అద్దం పట్టారు. జ్యోతులను తలపై ఎత్తుకొని ఆలయాలకు వెళ్లి గౌరమ్మకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ‘అమ్మమ్మ గౌరమ్మా... మాయమ్మ గౌరమ్మ మా ఇంటి మహాలక్ష్మి నీవమ్మా’ అంటూ ఊరేగింపు నిర్వహించి గ్రామ చెరువుల్లో నిమజ్జనం చేశారు.