అనంతపురం సిటీ: స్థానిక తాటిచెర్ల మార్గంలోని నేషనల్ హైవే బ్రిడ్జి కింద సోమవారం గూడ్స్ రైలు కింద పడి మల్లెల రవికుమార్(45) అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడని జీఆర్పీ ఎస్‌ఐ వెంకటేశ్వర్లు తెలిపారు. తొలుత గుర్తు తెలియని మృతదేహంగా భావించినా ఆ తరువాత మృతుడు అనంతపురం రూరల్ మండలం ఎ.నారాయణపురానికి చెందిన రవికుమార్‌గా గుర్తించినట్లు వివరించారు. ఆయనకు భార్య, ముగ్గురు పిల్లలున్నారన్నారు. కుటుంబ కలహాలు, ఆర్థికపర సమస్యలతో రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నట్లుగా భావిస్తున్నామన్నారు. ఘటనపై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.
సుప్రీంకోర్టు సీజేపై దాడి యత్నం గర్హనీయం
అనంతపురం: సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గవాయిపై ఓ మతోన్మాది దాడికి పాల్పడడం గర్హనీయమని వైఎస్సార్‌సీపీ లీగల్ సెల్ నాయకులు అన్నారు. దాడిని ఖండిస్తూ సోమవారం వైఎస్సార్‌సీపీ లీగల్ సెల్ జిల్లా అధ్యక్షుడు గాజుల ఉమాపతి, గౌని నాగన్న, నాగరాజు బాబు, రాజశేఖర్ యాదవ్, నారపురెడ్డి తదితరులు ఓ ప్రకటన విడుదల చేశారు. సాక్షాత్తూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై దాడి చేయడం భారత రాజ్యాంగంపై దాడికి యత్నించడమేనన్నారు. దుండగుడు తక్షణమే న్యాయవ్యవస్థకు క్షమాపణ చెప్పాలన్నారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని కించపరిచే ప్రయత్నం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
వ్యక్తి బలవన్మరణం
గుత్తి: స్థానిక జీఆర్‌పీ పరిధిలోని తురకపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో సోమవారం తెల్లవారు జామున ఓ గుర్తు తెలియని వ్యక్తి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుని వయస్సు సుమారు 40 సంవత్సరాలు ఉంటుంది. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న జీఆర్పీ ఇన్‌చార్జ్ ఎస్‌ఐ మహేంద్ర, కానిస్టేబుల్ నాగరాజు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని గుత్తి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆత్మ హత్య చేసుకున్న ప్రాంతంలో ఉన్న టీవీఎస్ బైక్‌ను స్టేషన్‌కు తరలించారు. బైక్ నంబర్ ఆధారంగా మృతుడి వివరాల కోసం ఆరా తీస్తున్నారు. ఘటనపై దర్యాప్తు చేపట్టినట్లు రైల్వే పోలీసులు తెలిపారు.