
తిరుగుతూనే ఉన్నామయ్యా
● ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’లో 375 వినతులు
అనంతపురం అర్బన్: ‘‘అయ్యా కార్యాలయాల చుట్టూ తిరుగుతూనే ఉన్నాము. మా సమస్యలు పరిష్కరించి ఆదుకోండి’’ అంటూ ప్రజాసమస్యల పరిష్కార వేదికలో అధికారులకు ప్రజలు విన్నవించుకున్నారు. సోమవారం కలెక్టరేట్‌లోని రెవెన్యూభవన్‌లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ప్రజల నుంచి జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ, డీఆర్‌ఓ ఎ.మలోల, డిప్యూటీ కలెక్టర్లు ఆనంద్, రామ్మోహన్, తిప్పేనాయక్, మల్లికార్జునుడు, మల్లికార్జునరెడ్డి, జిల్లా వ్యవసాయాధికారి ఉమామహేశ్వరమ్మ అర్జీలు స్వీకరించారు. వివిధ సమస్యలపై ప్రజల నుంచి 375 వినతులు అందాయి. కార్యక్రమం అనంతరం అర్జీల పరిష్కారంపై అధికారులతో జాయింట్ కలెక్టర్ సమీక్షించారు. అర్జీల పరిష్కార క్రమంలో ఏస్థాయిలోనూ నిర్లక్ష్యానికి తావివ్వకూడదని ఆదేశించారు.
● తన సోదరుని పేరిట ఉన్న భూమికి 1బీ, అడంగల్ రావడం లేదని బుక్కరాయసముద్రం మండల కేంద్రానికి చెందిన కృష్ణంరాజు విన్నవించాడు. సర్వే నంబరు 220–2లో తన తమ్ముడు శ్రీకాంత్ పేరున ఉన్న 4.18 ఎకరాల భూమికి 1బి, అడంగల్ రావడం లేదని చెప్పాడు. ఆన్‌లైన్‌లో చూసుకుంటే తహసీల్దారు డిజిటల్ సంతకం కాలేదని వస్తోందని, డిజిటల్ సంతకం చేయించి సమస్య పరిష్కరించాలని కోరాడు.