
పెళ్లింట విషాదం
● మెరవణిలో దూసుకొచ్చిన డీజే వాహనం
● చక్రాల కింద పడి పెళ్లికొడుకు తండ్రి దుర్మరణం
● మరొకరికి తీవ్ర గాయాలు
కనగానపల్లి: పెళ్లింట విషాదం చోటు చేసుకుంది. మెరవణి సమయంలో డీజే వాహనం అదుపుతప్పి మనుషులపైకి దూసుకొచ్చింది. ఈ ప్రమాదంలో పెళ్లికొడుకు తండ్రి దుర్మరణం చెందాడు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు తెలిపిన మేరకు.. కనగానపల్లికి చెందిన చిన్న తిరుమలయ్య (55), సరస్వతి దంపతులు. టీ హోటల్ నిర్వహించుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరికి ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు శివానంద వివాహం ఆదివారం పెనుకొండ సమీపంలోని గుట్టూరు వద్ద ఇందు అనే యువతితో జరిగింది. మధ్యాహ్నం బంధువులంతా తిరిగింపుల కోసం పెళ్లి కుమారుని స్వగ్రామం కనగానపల్లికి వెళ్లారు. సాయంత్రం వధూవరులతో కలిసి బంధుమిత్రులు సంతోషంగా మెరవణిలో పాల్గొన్నారు. డీజే కోసం ఏర్పాటు చేసిన వాహనం అదుపుతప్పి మెరవణిలో నడుచుకుంటూ వెళ్తున్న వారిపైకి దూసుకెళ్లింది. ఆ సమయంలో వాహనం ముందు భాగాన ఉన్న పెళ్లి కుమారుడు తండ్రి చిన్న తిరుమలయ్య, ఆయన సోదరుడు ఆదెప్ప చక్రాల కింద పడ్డారు. వీరిలో చిన్న తిరుమలయ్య తల పగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. తీవ్రంగా గాయపడిన ఆదెప్పను అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అంతవరకూ సంతోషంగా సాగిన వేడుక ఈ ఘటనతో విషాదంగా మారిపోయింది.