
పరిటాల దోపిడీకి సరిలేరెవ్వరూ
● అక్రమ సొమ్ముతోనే పరిటాల సునీత బెంజి కారులో తిరుగుతోంది
● మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి ఫైర్
అనంతపురం ఎడ్యుకేషన్: ఉమ్మడి అనంతపురం జిల్లాలో పరిటాల వారి దోపిడీకి ఎవరూ సరిలేరని మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి మండిపడ్డారు. ఆదివారం వైఎస్సార్ సీపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కక్కలపల్లి టమాట మండీలో రోజూ రూ. 5 లక్షలు శ్రీరామ్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారన్నారు. ధర్మవరం, అనంత పురం, చెన్నేకొత్తపల్లిలోని మూడు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల నుంచి రోజూ రూ. 25 లక్షలు పరిటాల ఇంటికి వెళ్తోందన్నారు. నియోజకవర్గంలో వెయ్యి బెల్ట్‌షాపులుండగా, నిత్యం ఒక్కో షాపు నుంచి రూ. 2 వేలు పరిటాల కుటుంబం పేరుతో వసూలు చేస్తున్నారన్నారు. చివరకు నసనకోట ముత్యాలమ్మ గుడినీ వదల్లేదని, అక్కడి బెల్ట్‌షాపు నుంచి రోజూ రూ. లక్ష వెంకటాపురంలోని వారి ఇంటికి వెళ్తోందన్నారు.
ఆదాయం చాలా ఎక్కువ..
పరిటాల కుటుంబీకులకు వెంకటాపురంలో కాకుండా అనంతపురం, హైదరాబాద్, బెంగళూరు, ధర్మవరంలో ఉన్న భవనాల విలువ రూ. 150 కోట్లు అని, ఇక.. కాంప్లెక్స్‌లు, కియా వద్ద భూములు, గ్రానైట్ క్వారీల గురించి మాట్లాడడం లేదన్నారు. ఆదాయం ఎక్కువైపోయి హైదరాబాద్, బెంగళూర్ లో పబ్‌లు కూడా ఏర్పాటు చేశారని, ఇవీ చాలవ న్నట్లు అమెరికాలో రెండు, ఆఫ్రికాలో ఒకచోట లిక్కర్ ఫ్యాక్టరీలు తెరిచారన్నారు. ‘మీ చరిత్ర తెలిసే లోకేష్ మీకు అపాయింట్‌మెంట్ కూడా ఇవ్వలేదు’ అని విమర్శలు గుప్పించారు. పెద్ద ఎత్తున ఆదాయవనరులు ఏర్పాటు చేసుకుని కూడా పాపంపేటలో 300 ఎకరాల శోత్రియం భూములపై పడ్డారన్నారు. అదికూడా చాలదని 999 ఎకరాలు కావాలని అడుగుతున్నారని ఆరోపించారు. పాపంపేటలో దుర్మార్గంగా 20 ఇళ్లను నేలమట్టం చేశారన్నారు.
రూ. 3 కోట్ల విలువైన బెంజి కారులో..
అక్రమ ఆదాయంతోనే నేడు పరిటాల సునీత రూ. 3 కోట్ల విలువైన బెంజి కారులో తిరుగుతోందన్నారు. ‘సునీతమ్మా...తోపుదుర్తిలో మహిళలు నీ మీద రెండు ట్రాక్టర్ల చెప్పులు విసిరారు. 2 వేల మంది పోలీసులతో వచ్చినా ఆరు గంటలపాటు గ్రామంలోకి రాలేకపోయావు. ప్రజలు తిరగబడితే ఎలా ఉంటుందో 164 మంది ఎమ్మెల్యేలకంటే నీకే బాగా తెలుసు. 50 వేల మంది ఇళ్ల నిర్మాణాలు జరగకుండా ఆపినావు. ఆ 50 వేలమంది చెప్పులు విసిరితే ఆ గుట్టలో నువ్వు కనిపిస్తావా’ అని మండిపడ్డారు. ‘నువ్వేమైనా మైసూరు మహారాణి అనుకుంటున్నావా..? పథకాలు అడిగితే చెప్పులు చూపిస్తావా.. పేదలకు ఇళ్ల నిర్మాణాలు జరగలేదని మాట్లాడితే చెప్పు తెగుతుందంటావా.. నీకు ప్రజలే చెప్పులు చూపించే రోజులు వస్తాయి’ అంటూ మండిపడ్డారు. సమావేశంలో అనంతపురం రూరల్ జెడ్పీటీసీ సభ్యుడు చంద్రకుమార్, అనంతపురం, రాప్తాడు వైస్ ఎంపీపీలు కృష్ణారెడ్డి, బోయ రామాంజి, నాయకులు రంగంపేట గోపాల్‌రెడ్డి, బండి పవన్, లింగారెడ్డి, ఆలమూరు ఓబులేసు,శేఖర్, సత్తిరెడ్డి, మాదన్న, మునిశంకరయ్య, ఈశ్వరయ్య, మీనుగ నాగరాజు పాల్గొన్నారు.
ఇళ్ల నిర్మాణాల్లో భారీ స్కాం
కూటమి ప్రభుత్వంలో పక్కా ఇళ్ల నిర్మాణాల్లో భారీ స్కాం జరుగుతోందని తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో ఇళ్లు లేని నిరుపేదలకు గూడు కల్పించాలనే ఉద్దేశంతో గత ప్రభుత్వంలో జగనన్న కాలనీలను ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. ఇల్లు సొంతంగా నిర్మించుకోలేమనే లబ్ధిదారులకు ప్రభుత్వమే కేవలం రూ.1.80 లక్షలకే ఇల్లు నిర్మించే బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు. అయితే.. ప్రభుత్వం మారిన తర్వాత ఈ ఇళ్ల నిర్మాణాలు ఎక్కడికక్కడే ఆగిపోయాయన్నారు. వాటి గురించి కూటమి ప్రభుత్వం ఏమాత్రమూ పట్టించుకోవడం లేదన్నారు. పైగా కూటమి ఎమ్మెల్యేలు కొత్త స్కాంకు తెర తీశారన్నారు. ప్రతి ఇంటికీ రూ.10 వేలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లోనూ ఇదే పరిస్థితి ఉందన్నారు. చంద్రబాబు, లోకేష్‌లకు ఛాలెంజ్ చేస్తున్నానని, వారికి చేతనైతే ఇది అబద్ధమని నిరూపించుకోవాలని సవాల్ విసిరారు.