నేడు కలెక్టరేట్‌లో పరిష్కార వేదిక | - | Sakshi
Sakshi News home page

నేడు కలెక్టరేట్‌లో పరిష్కార వేదిక

Oct 6 2025 2:12 AM | Updated on Oct 6 2025 2:12 AM

నేడు

నేడు కలెక్టరేట్‌లో పరిష్కార వేదిక

అనంతపురం అర్బన్‌: ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించనున్నట్లు కలెక్టర్‌ ఓ.ఆనంద్‌ ఒక ప్రకటనలో తెలిపారు. రెవెన్యూభవన్‌లో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరగనున్న కార్యక్రమంలో ప్రజలు తమ సమస్యలను అర్జీ రూపంలో అధికారులకు సమర్పించాలన్నారు. అర్జీతో పాటు ఫోన్‌, ఆధార్‌ నంబర్లు తప్పనిసరిగా ఇవ్వాలని సూచించారు. గతంలో అర్జీ ఇచ్చి ఉంటే దానికి సంబంధించి రసీదు తీసుకురావాలన్నారు. సమర్పించిన అర్జీ పరిష్కార స్థితి గురించి కాల్‌సెంటర్‌ 1100కు ఫోన్‌ చేసి తెలుసుకోవచ్చన్నారు. ప్రజలు తమ అర్జీలను పరిష్కార వేదికలోనే కాకుండా meekosam.ap.gov.in వెబ్‌సైట్‌లోకి వెళ్లి ఆన్‌లైన్‌లోనూ సమర్పించవచ్చని తెలియజేశారు.

విజయవాడ వెళ్లిన కలెక్టర్‌

అనంతపురం అర్బన్‌: జిల్లా కలెక్టర్‌ ఓ.ఆనంద్‌ ఆదివారం విజయవాడకు బయలుదేరి వెళ్లారు.‘స్వచ్ఛ జిల్లా అవార్డు–2025’కు అనంతపురం ఎంపికైన విషయం విదితమే. సోమవారం విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించనున్న కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా అవార్డును కలెక్టర్‌ అందుకోనున్నారు. ఆయన తిరిగి ఏడో తేదీన విధులకు హాజరవుతారు.

ఒంటెద్దు కళ్లకు గంతలు కట్టి.. పదెకరాల్లో శనగ సాగు

ఆత్మకూరు: మండలకేంద్రానికి చెందిన దుబ్బ గోపాల్‌రెడ్డి అనే రైతు చేసిన సాహసం అందరి చేత శభాష్‌ అనిపించేలా చేసింది. ఆదివారం ఆత్మకూరు సమీపంలోని పొలంలో పాళ్యం వెంకట నారాయణ రెడ్డి అనే రైతుకు సంబంధించిన ఎద్దుతో దుబ్బ గోపాల్‌రెడ్డి వినూత్న ప్రయోగం చేశాడు. ఆ ఎద్దు కళ్లకు గంతలు కట్టి ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల లోపు పదెక రాల్లో శనగ విత్తనం సాగు చేసి అందర్నీ అబ్బురపరిచాడు. చాలా మంది కాడెద్దులతో విత్తన సాగు చేస్తారు. ప్రస్తుత పరిస్థితుల్లో పలువురు ఎద్దులకు బదులు ట్రాక్టర్లతో విత్తనం వేస్తున్నారు. కానీ దుబ్బ గోపాల్‌రెడ్డి ఒక ఎద్దుతో అది కూడా దాని కళ్లకు గంతలు కట్టి పది ఎకరాల్లో తొమ్మిది గంటలలోపే విత్తన సాగు చేయడంపై రైతులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. దీంతో ఆత్మకూరులో దుబ్బ గోపాల్‌రెడ్డితోపాటు సదరు వృషభానికి పూల మాలలు వేసి ఊరేగించారు.

సత్యసాయి సన్నిధిలో

విజయ్‌ దేవరకొండ

ప్రశాంతి నిలయం: సినీ నటుడు విజయ్‌ దేవరకొండ ఆదివారం సత్యసాయి మహాసమాధి దర్శనార్థం పుట్టపర్తికి వచ్చారు. బెంగళూరు నుంచి రోడ్డు మార్గంలో ప్రశాంతి నిలయం చేరుకున్న ఆయనకు శాంతిభవన్‌ అతిథి గృహం వద్ద సత్యసాయి సెంట్రల్‌ ట్రస్ట్‌ ప్రతినిధులు ఘనంగా స్వాగతం పలికారు. అతిథి గృహంలో విశ్రాంతి తీసుకున్న తర్వాత సాయికుల్వంత్‌ సభా మందిరంలో సత్యసాయి మహాసమాధిని దర్శించుకున్నారు.

బీకేఎస్‌లో దొంగల హల్‌చల్‌

బుక్కరాయసముద్రం: మండల కేంద్రంలో దొంగలు హల్‌చల్‌ చేశారు. దక్షిణామూర్తి నగర్‌లో నివాసం ఉంటున్న అనిల్‌ కుమార్‌, అశోక్‌ తమ ఇళ్లకు తాళం వేసి కుటుంబసభ్యులతో కలసి బంధువుల ఇంట శుభకార్యానికి వెళ్లారు. దుండగులు శనివారం అర్ధరాత్రి కుక్కకు మత్తు మందు పెట్టి తాళాలు బద్ధలు గొట్టి లోపలకు ప్రవేశించారు. బీరువాలోని 5 తులాల బంగారు నగలు అపహరించారు. నలుగురు వ్యక్తులు చొరబడుతున్నట్లుగా సమీపంలోని ఇంటి వద్ద సీసీ కెమెరాలో కనిపించింది. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు పోలీసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

నేడు కలెక్టరేట్‌లో  పరిష్కార వేదిక 1
1/2

నేడు కలెక్టరేట్‌లో పరిష్కార వేదిక

నేడు కలెక్టరేట్‌లో  పరిష్కార వేదిక 2
2/2

నేడు కలెక్టరేట్‌లో పరిష్కార వేదిక

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement