
సా...గుతున్న ఈ–క్రాప్
● 42 శాతం వద్దే ప్రక్రియ
● ఈనెల 25 లోపు పూర్తి చేయాలని
కమిషనరేట్ నుంచి ఆదేశాలు
అనంతపురం అగ్రికల్చర్: ఖరీఫ్‌లో వ్యవసాయ, ఉద్యాన, మల్బరీ పంటల సాగుకు సంబంధించి వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ–క్రాప్ ప్రక్రియ ఈ సారి మందకొడిగా సాగుతోంది. ఓ వైపు సాంకేతిక సమస్యలు, మరోవైపు ఆర్‌ఎస్‌కే అసిస్టెంట్లకు ఇతరత్రా పని ఒత్తిళ్లు పెట్టడం, ఇంకోవైపు ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపం కారణంగా పంటల నమోదుకు అంతరాయం ఏర్పడుతోందని చెబుతున్నారు. గత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం హయాంలో తీసుకువచ్చిన ఈ–క్రాప్ ప్రక్రియ వల్ల రైతులకు అనేక రకాల ప్రయోజనాలు కల్పించడంతో పంట నమోదు చురుగ్గా, చాలా పారదర్శకంగా కొనసాగించారు. కానీ కూటమి సర్కారు ఈ–క్రాప్‌కు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వకపోవడంతో అదే అదనుగా ఆయా శాఖల అధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. దీంతో ఖరీఫ్ ముగిసిన సెప్టెంబర్ ఆఖరు నాటికే ఈ–క్రాప్ పూర్తి కావాలని ఆదేశాలు ఉన్నా 40 శాతం కూడా పూర్తి కాలేదు. తాజాగా అక్టోబర్ 25 నాటికి వంద శాతం పూర్తీ చేయాలని ఆదేశాలు ఇచ్చారు. అయినా గడువులోపు వంద శాతం పూర్తి కావడం కష్టమేనంటున్నారు. ఖరీఫ్‌లో వ్యవసాయ, ఉద్యాన, మల్బరీ పంటలు ఇప్పటి వరకు 19.02 లక్షల ఎకరాల్లో సాగు చేసినట్లు నివేదికలు చెబుతున్నాయి. ఈ–క్రాప్‌లో మాత్రం ఇప్పటి వరకు 8 లక్షల ఎకరాలు నమోదు చేశారు. అంటే ఇప్పటి వరకు 42 శాతం పూర్తి చేశారు. గత రెండు నెలలుగా కేవలం 42 శాతం చేయగా... ఈ 20 రోజుల్లో 58 శాతం పూర్తి చేయడం అంత సులభం కాదని చెబుతున్నారు. సాగు చేసిన పంటలనే కాకుండా ఖాళీగా ఉన్న పొలాల వివరాలు కూడా ఈ–క్రాప్ చేయాలని నిబంధన పెట్టడంతో ఆర్‌ఎస్‌కే అసిస్టెంట్లు తీవ్ర ఒత్తిడిలో ఉన్నట్లు తెలిసింది. మొత్తమ్మీద ఈ ఏడాది ఈ–క్రాప్ నమోదు పారదర్శకతపై పలువురు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.