
మంట కలుస్తున్న మానవత్వం
అనుబంధాలకు ప్రస్తుత సమాజంలో విలువ లేకుండా పోతోంది. ఆప్యాయతలు, ప్రేమానురాగాలు కనుమరుగవుతున్నాయి. ఆస్తుల మాయలో పడి సొంత వారిని సైతం హతమార్చే స్థాయికి బంధాలు దిగజారుతున్నాయి. డబ్బుంటే చాలు .. ఇంకేం వద్దు అనే స్థాయికి దిగజార్చి పేగు బంధాలను కడతేరుస్తున్నాయి.
రాయదుర్గం: ‘నాన్నా! నీవు చచ్చిపో... ఆస్తి సొంతమవుతుంది’ అంటూ స్థిరాస్తుల కోసం రక్త సంబంధాలనే కాదనుకునే కొందరి తీరుతో మానవత్వం మంట కలుస్తోంది. జన్మనిచ్చిన తల్లి, తండ్రిని హతమార్చడం, మద్యం తాగేందుకు డబ్బు ఇవ్వలేదంటూ కట్టుకున్న భార్యను హత్య చేయడం వంటి ఘటనలు జిల్లాలో కలకలం రేపుతున్నాయి. కొందరు మద్యం మత్తులో, మరికొందరు క్షణికావేశంలో, ఇంకొందరు పథకం ప్రకారం హత్యలకు పాల్పడిన ఘటనలు మానవత్వానికి మాయని మచ్ఛగా నిలిచాయి.
మచ్చుకు కొన్ని...
జిల్లాలో ఆస్తుల కోసం కన్న వారినే హతమార్చిన ఘటనలు దాదాపు 16 వరకు ఉన్నాయి. కారణాలేమైన సరే మలి వయస్సులో వారికి తోడుగా ఉండాల్సిన కన్నబిడ్డలే విచక్షణ కోల్పోయి ప్రవర్తిస్తున్నారు. కొట్టడం, తిట్టడం, పేగు బంధం అన్న మాటే మరిచి మారణాయుదాలతో మట్టుపెట్టడం లాంటి ఘటనలు చూస్తుంటే సభ్యసమాజం ఎటు పోతుందో అర్థం కావడం లేదు.
● ఈ ఏడాది మార్చి 25న రాయదుర్గం మండలం టి.వీరాపురంలో వాల్మీకి సుంకప్ప (62) దారుణ హత్యకు గురయ్యాడు. కుమారుడు వన్నూరుస్వామినే మచ్చుకత్తితో గొంతు కింద నరికి చంపేశాడు. తండ్రి పేరుపై ఉన్న రెండు ఎకరాల స్థిరాస్తిని తన పేరుపై బదలాయించాలని కొంత కాలంగా కుమారుడు పట్టుపట్టడంతో తన మరణానంతరం ఆస్తి నీ సొంతమవుతుందని తండ్రి నచ్చచెప్పే ప్రయత్నం చేశాడు. ఈ మాటతో క్షణికావేశానికి లోనై తండ్రి ప్రాణాలను బలిగొన్నాడు.
● మండలంలోని చదం గ్రామంలో గత ఏడాది డిసెంబర్ 12న దాయాదుల మధ్య భూ వివాదం చోటు చేసుకుని ఘర్షణ పడ్డారు. ఇందులో గంగాధర అనే రైతు తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చేరాడు. కొన్నాళ్ల తర్వాత మృతి చెందాడు. ఆయన మృతికి పొలం గట్టు మధ్య పడిన ఘర్షణనే కారణమని పోలీసులు నిర్ధారించారు.
● రాయదుర్గానికి చెందిన ఓ రైతు ఇటీవల కర్ణాటక సమీపంలోని పొలాన్ని కౌలుకు తీసుకుని మొక్కజొన్న సాగు చేశాడు. కుమారుడికి కాకుండా కోడలికి వత్తాసు పలుకుతుంటాడనే అక్కసుతో కన్న కుమారుడే ఓ రోజు మచ్చుకత్తితో దాడి చేసి హతమార్చాడు. అనంతరం రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించారు. దర్యాప్తులో అది హత్యగా పోలీసులు నిర్ధారించారు.