
పంచాయతీలను అభివృద్ధి బాట పట్టించండి
● అధికారులకు జెడ్పీ సీఈఓ శివశంకర్ ఆదేశం
రాప్తాడు: ప్రస్తుతం సేంద్రియ ఎరువులకు భారీగా డిమాండ్ ఉందని, అందువల్ల చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాల్లో సేంద్రియ ఎరువులు తయారు చేసి పంచాయతీలను అభివృద్ధి పథంలో నడిపించాలని జిల్లా పరిషత్ సీఈఓ జి.శివశంకర్ అధికారులను ఆదేశించారు. బుధవారం ఆయన మండలంలోని బుక్కచెర్ల గ్రామ పంచాయతీలో పర్యటించారు. పంచాయతీ కార్మికులు ఇంటింటికీ వచ్చి చెత్త సేకరిస్తున్నారా, తాగునీరు సక్రమంగా సరఫరా అవుతుందా.. అని ప్రజలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గ్రామాలు పరిశుభ్రంగా ఉంటేనే ప్రజలు ఆరోగ్యంగా ఉంటారన్నారు. అందువల్ల సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు పరిసరాల పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. పంచాయతీ కార్మికులు కూడా తమకు కేటాయించిన ఇళ్ల నుంచి రోజూ చెత్త సేకరించి చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాలకు తరలించాలని, అక్కడ వర్మీ కంపోస్ట్ ఎరువును తయారు చేసి రైతులకు విక్రయించాలన్నారు. గ్రామాల్లో దోమల నివారణకు ఫాగింగ్ చేయాలన్నారు. కార్యక్రమంలో ఎంపీడీఓ విజయలక్ష్మి, ఇన్‌చార్జి ఈఓఆర్‌డీ ప్రేమ్ కుమార్, పంచాయతీ కార్యదర్శి మహేంద్రరెడ్డి పాల్గొన్నారు.
‘సత్య’కీర్తి అంతర్జాతీయంగా శోభిల్లేలా..
ప్రశాంతి నిలయం: ‘సత్యసాయి శత జయంతి వేడుకలను ప్రతిష్టాత్మకంగా తీసుకుందాం. వేడుకలకు దేశవిదేశాల నుంచి భక్తులు వస్తారు. ఏ ఒక్క భక్తుడికీ ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేద్దాం. మన ఆతిథ్యంతో సత్యసాయి కీర్తిని అంతర్జాతీయంగా శోభిల్లేలా చేద్దాం’ అని అధికారులకు శ్రీసత్యసాయి జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్‌ప్రసాద్ పిలుపునిచ్చారు. సత్యసాయి శత జయంతి వేడుకల నిర్వహణపై బుధవారం కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్సు హాలులో అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. సత్యసాయి శతజయంతి వేడుకలను దేశం గర్వించేలా పర్యావరణ హితంగా నిర్వహించాలన్నారు. రోజువారీ భక్తుల రాకపోకలను ఎప్పటికప్పుడు అంచనా వేసి అవసరమైన ఏర్పాట్లు చేసేలా ప్రణాళికలు రూపొందించాలన్నారు. తాగునీరు, శానిటేషన్, మొబైల్ టాయిలెట్లు, వీధి దీపాలు, డస్ట్‌బిన్లు, వ్యర్థాల నిర్వహణ, ఫుడ్ కౌంటర్లు, అదనపు సిబ్బంది నియామకం తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. భక్తుల రాకపోకలు, ముఖ్య ప్రదేశాల్లో భద్రత, ట్రాఫిక్ నియంత్రణ, పటిష్టమైన పహారా కోసం స్పష్టమైన కార్యాచరణ ఉండాలని ఆదేశించారు. సమావేశంలో జేసీ అభిషేక్ కుమార్, ఎస్పీ సతీష్ కుమార్, పుట్టపర్తి ఆర్డీఓ సువర్ణ, సత్యసాయి ట్రస్ట్ ప్రతినిధులు చలం, డాక్టర్ నారాయణన్, ప్రభు, రామేశ్వర్ షృష్టి, రాజేష్ దేశాయ్, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

పంచాయతీలను అభివృద్ధి బాట పట్టించండి