ఎదుగుదలను ఓర్వలేక అంతమొందించారా? | - | Sakshi
Sakshi News home page

ఎదుగుదలను ఓర్వలేక అంతమొందించారా?

Sep 26 2025 6:52 PM | Updated on Sep 26 2025 6:52 PM

ఎదుగుదలను ఓర్వలేక అంతమొందించారా?

ఎదుగుదలను ఓర్వలేక అంతమొందించారా?

పామిడి: వైఎస్సార్‌సీపీ నాయకుడు సతీష్‌రెడ్డి ఎదుగుదలను ఓర్వ లేక ప్రత్యర్థులు అంతమొందించారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బుధవారం రాత్రి మండలంలోని కాలాపురం గ్రామ సమీపాన వైఎస్సార్‌ సీపీ రూరల్‌ బూత్‌ కన్వీనర్ల ప్రెసిడెంట్‌ దేవన సతీష్‌రెడ్డి (34) మృతిపై పలు అనుమానాలు నెలకొన్నాయి. విశ్వసనీయ సమాచారం మేరకు.. సతీష్‌ రెడ్డి, అదే గ్రామానికి చెందిన ఓ టీడీపీ నాయకుడు మంచి స్నేహితులు. ఈ క్రమంలో నాలుగు నెలల క్రితం సదరు టీడీపీ నాయకుడి కుటుంబ వ్యవహారంలో సతీష్‌రెడ్డి జోక్యం చేసుకున్నారు. దీంతో మిత్రుడి కుటుంబంలోని టీడీపీ నాయకుడికి, సతీష్‌ రెడ్డికి మధ్య విభేదాలు తలెత్తాయి. గతంలో ఆ వ్యక్తి వాటర్‌ ప్లాంట్‌ విషయంలోనూ సతీష్‌రెడ్డి జోక్యం చేసుకొన్నారు. కొన్ని రోజుల క్రితం గ్రామం వదిలిపెట్టి వెళ్లిన సదరు టీడీపీ నాయకుడు ఇటీవలే పామిడిలో ప్రత్యక్షమయ్యాడు. సతీష్‌రెడ్డి వైఎస్సార్‌ సీపీ కార్యక్ర మాల్లో చురుగ్గా పాల్గొంటూ ఎదిగిపోతుండడం చూసి ఓర్వలేకపోయాడని, ఎలాగైనా అంతమొందించాలని భావించి బుధవారం రాత్రి హత్యకు పాల్పడ్డాడనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనికితోడు పోస్టుమార్టం చేశాక పోలీసులు సతీష్‌రెడ్డి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించకుండా ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ నిపుణులంటూ వేచి ఉండడం అనుమానాలకు బలం చేకూరుస్తోంది.

రోడ్డు ప్రమాదమట..!

రోడ్డు ప్రమాదం కారణంగానే సతీష్‌ రెడ్డి మృతి చెందాడని ఓ వ్యక్తి గురువారం రాత్రి పోలీసు ప్రతినిధినంటూ ‘సాక్షి’కి ఫోన్‌ చేసి తెలపడం గమనార్హం. సీసీ ఫుటేజీల్లో ఓ ట్రాక్టర్‌, సతీష్‌రెడ్డి ద్విచక్రవాహనం ఒకదాని వెనుక ఒకటి వెళ్లినట్లు కనిపించాయని, ఆ ట్రాక్టర్‌ను సతీష్‌రెడ్డి ద్విచక్రవాహనం ఢీ కొనడంతోనే తీవ్ర గాయాలపాలై చనిపోయాడని చెప్పారు. ట్రాక్టర్‌ రేకు కారణంగా సతీష్‌రెడ్డి గొంతు కోసుకుపోయి ఉంటుందన్నారు. మరోవైపు సతీష్‌రెడ్డి మృతిపై అనుమానాలు ఉన్నాయని, పోస్టుమార్టం నివేదిక ఆధారంగా దర్యాప్తు చేపట్టి వాస్తవాలు బహిర్గతం చేస్తామంటూ పామిడి ఇన్‌చార్జ్‌ సీఐ రాజు తెలపడం గమనార్హం. సతీష్‌రెడ్డి ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనం ముందు భాగం పూర్తిగా ధ్వంసమైందని, కేసు దర్యాప్తులో భాగంగా ఇప్పటికే క్లూస్‌ టీం, పోలీసు జాగిలాల సాయంతో ఆధారాలు సేకరించినట్లు పేర్కొన్నారు.

అధైర్య పడొద్దు.. అండగా ఉంటాం

పార్టీ తరఫున అన్ని విధాలా అండగా ఉంటామని, అధైర్య పడరాదని సతీష్‌రెడ్డి కుటుంబసభ్యులకు గుంతకల్లు మాజీ ఎమ్మెల్యే వై.వెంకట్రామిరెడ్డి ధైర్యం చెప్పారు. గురువారం జీ కొట్టాల గ్రామంలో నిర్వహించిన సతీష్‌ రెడ్డి అంత్యక్రియల్లో వైవీఆర్‌ పాల్గొన్నారు. సతీష్‌ రెడ్డి తల్లి సుంకురత్నమ్మ, తండ్రి కాశీవిశ్వనాథరెడ్డి, సోదరి మహాలక్ష్మి, సోదరులు సుదర్శన్‌రెడ్డి, వెంకట నరసింహారెడ్డి, బంధువులను ఓదార్చారు. విషయాన్ని పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లినట్లు వెల్లడించారు. సతీష్‌రెడ్డి మృతి అంశాన్ని అధిష్టానం సీరియస్‌గా తీసుకుందని, బాధిత కుటుంబానికి అండగా ఉంటానని జగనన్న భరోసానిచ్చారని తెలిపారు. ఆయన వెంట పార్టీ జిల్లా ఆర్గనైజింగ్‌ కార్యదర్శి పెమ్మక చెన్నకేశవరెడ్డి, నాయకులు బోయ రామచంద్ర, సునీల్‌రెడ్డి, రమేష్‌రెడ్డి, రూపేష్‌రెడ్డి తదితరులు ఉన్నారు. కాగా, పామిడిలోని సీహెచ్‌సీ మార్చురీలో సతీష్‌రెడ్డి మృతదేహానికి డీసీసీబీ మాజీ చైర్మన్‌ ఎం. వీరాంజ నేయులు నివాళులర్పించారు.

వైఎస్సార్‌సీపీ నాయకుడు సతీష్‌రెడ్డి మరణంపై అనుమానాలెన్నో!

స్వగ్రామంలో ఓ టీడీపీ నాయకుడితో విభేదాలున్నట్లు వినికిడి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement