
అగ్రి ల్యాబ్‌లకు చంద్రగ్రహణం
రాయదుర్గం: విత్తనం మంచిదైతే పంట బాగుంటుంది. పంట కళకళలాడితే దిగుబడికి దిగులుండదు. ధరలూ కలిసొస్తే రైతుకు తిరుగుండదు. అంతా సవ్యంగా జరగాలంటే మేలి రకం విత్తనం కావాలి. దీన్ని దృష్టిలో ఉంచుకుని గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో అప్పటి సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి అగ్రి ల్యాబ్‌ల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు.జిల్లాలోని రాయదుర్గం, కళ్యాణదుర్గం, ఉరవకొండ, తాడిపత్రి, నార్పల, అనంతపురం, గుంతకల్లులో అగ్రి ల్యాబ్‌లు నిర్మించారు. ఒక్కో ల్యాబ్ నిర్మాణానికి, వసతులకు రూ.కోటి ఖర్చు చేశారు. మట్టి నమూనాలు, విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల పరీక్షలతో పాటు పశుసంవర్ధక శాఖ, ఆక్వా కల్చర్ అభివృద్ధిలో భాగంగా అందుకు సంబంధించి పరీక్షలు నిర్వహించేందుకు ప్రత్యేక సిబ్బందిని కేటాయించారు. రాయదుర్గంలో స్వయంగా జగన్ చేతుల మీదుగా అగ్రి ల్యాబ్‌ను ప్రారంభించారు.
కూటమి ప్రభుత్వంలో నష్టాలు..
అగ్రి ల్యాబ్‌ల ద్వారా విత్తన పరీక్ష నివేదిక వారం నుంచి పది రోజుల్లోనే పొందవచ్చు. పురుగు మందులు, ఎరువుల నాణ్యత నిర్ధారణ రిపోర్టును రెండు లేదా మూడు రోజుల్లోపు అందిస్తారు. రైతులు కాకుండా ఇతర ప్రైవేటు వ్యాపారులు, డీలర్లు, తయారీదారులు నాణ్యత ప్రమాణాల పరీక్ష నివేదిక కోసం ఎరువుల రకాన్ని బట్టి రూ. వెయ్యి నుంచి రూ. 3 వేల వరకు చెల్లిస్తే చాలు. విత్తనాల నివేదిక కోసం రూ.200 మాత్రమే చెల్లించేలా రుసుం విధించారు. రైతులకై తే సేవలన్నీ ఉచితం. ఇలా ఎంతో మేలు చేకూర్చేలా గత ప్రభుత్వం తీసు కొచ్చిన అగ్రి ల్యాబ్‌ల నిర్వహణను కూటమి ప్రభుత్వం గాలికొదిలేయడంతో సేవలేవీ రైతులకు అందడం లేదు. వసతుల కల్పనతో పాటు సిబ్బందిని సర్దుబాటు చేయడంలో నిర్లక్ష్యం చూపడంతో నేడు నామమాత్రంగా పరీక్షలు జరుగుతున్నాయి. అది కూడా రాయదుర్గం, కళ్యాణదుర్గం, గుత్తి అగ్రి ల్యాబ్‌లలో మాత్రమే అరకొరగా టెస్టింగ్‌లు చేస్తున్నారు. మిగిలిన చోట్ల అవి కూడా లేవు. జిల్లాలో ఏటా వరి, కంది, పత్తి, మొక్కజొన్న, తదితర పంటలు రైతులు సాగుచేస్తున్నారు. అగ్రి ల్యాబ్‌లు సరిగా పనిచేయని నేపథ్యంలో నకిలీ విత్తనాలను కొంటూ నష్టాలు మూట కట్టుకుంటున్నారు.
ఇబ్బందులు లేకుండా చూస్తాం
అగ్రి ల్యాబ్‌లలో టెక్నికల్ ఏఓలు, ఏఈఓలు, ఎంపీఈఓలను అందుబాటులో ఉంచాం. ప్రస్తుతం టెస్టింగ్‌లు వచ్చినప్పుడు మాత్రమే వారిని వినియోగించి ఆ తర్వాత క్రాప్ బుకింగ్‌కు వాడుకుంటున్నాం. అగ్రి ల్యాబ్‌లపై నివేదిక తెప్పించుకుని పూర్తిస్థాయిలో పరీక్షలు మొదలయ్యేలా చర్యలు చేపడతాం. రైతులకు ఇబ్బందులు లేకుండా చూస్తాం. – ఉమామహేశ్వరమ్మ, జేడీఏ
రైతులను చులకనగా చూడొద్దు
వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో రాయదుర్గంలోని అగ్రి ల్యాబ్‌లో బాగా పరీక్షలు నిర్వహించారు. నేడు కేవలం మెలకశాతం మాత్రమే చేస్తున్నారు. పశు సంవర్ధక, మత్స్యశాఖలకు సంబంధించిన సేవలు కనిపించడం లేదు. మట్టి నమూనాలు కూడా తీసుకోవడం లేదు. రైతుల పట్ల చులకనభావం సరికాదు. –శివన్న, రైతు, రంగచేడు
రైతు సంక్షేమమే లక్ష్యంగా గత ప్రభుత్వంలో ఏర్పాటు
కూటమి అధికారంలోకి వచ్చాక నిర్వహణపై నిర్లక్ష్యం
జరగని పరీక్షలు.. అందని ఫలితాలు
నకిలీ విత్తనాలతో చిత్తవుతున్న రైతులు