
అమ్మా.. నేనేం పాపం చేశా!
కడుపులో నేను పడ్డానని
తెలియగానే మురిసిపోయావు..
నవమాసాలు కంటికి రెప్పలా మోశావు..
పురిటి నొప్పులు తట్టుకున్నావు..
నువ్వు పునర్జన్మ పొంది.. నాకు జన్మనిచ్చావు..
ఇంత చేసి చివరికి ఆప్యాయత పంచకుండానే పడేశావు...
అసలు నేనేం పాపం చేశానమ్మా!
(అనంతపురం నగరంలో రోడ్డు పక్కన పడి ఉన్న ఓ పసికందు అంతరంగానికి అక్షర రూపమిది)
అనంతపురం: అప్పుడే పుట్టిన పసికందును నిర్దాక్షిణ్యంగా రోడ్డుపై పడేసి వెళ్లిన ఘటన గురువారం అనంతపురం నగరంలో సర్వత్రా చర్చనీయాంశమైంది. ఆడబిడ్డ అనే చిన్నచూపో లేక మరేదైనా కారణమో గానీ ముక్కుపచ్చలారని శిశువును అమానవీయంగా వదిలేసి వెళ్లారు. వివరాల్లోకి వెళితే... అనంతపురం సాయినగర్ ఏడో క్రాస్‌లో గురువారం తెల్లవారుజామున నవజాత శిశువును పాలిథిన్ కవర్‌లో చుట్టి రోడ్డు పక్కన వదిలిపెట్టారు. శిశువు ఏడుపు విని చుట్టుపక్కల ఇళ్ల వారు నిద్రలేచి అధికారులకు సమాచారం ఇచ్చారు. టూటౌన్ ఎస్‌ఐ రుష్యేంద్ర, ఐసీడీఎస్ పీడీ ఎం.నాగమణి, డీసీపీఓ మంజునాథ్, మూడో సచివాలయం మహిళా పోలీస్ టీఎం సుస్మిత, ఏఎన్‌ఎం లక్ష్మి అక్కడికి చేరుకుని నవజాత శిశువును స్థానిక ప్రభుత్వ సర్వజనాసుపత్రికి తరలించారు. ఆర్‌ఎంఓ డాక్టర్ హేమలత ఆధ్వర్యంలో శిశువుకు చికిత్స అందిస్తున్నారు. 72 గంటలు డాక్టర్ల పర్యవేక్షణలో ఉండాలని తెలిపారు. శిశువుకు కావాల్సిన పాలను మదర్ మిల్క్ బ్యాంకు నుంచి అందిస్తున్నారు. శిశువును వదిలేసి వెళ్లిన ఘటనపై పోలీసులు విచారణ చేస్తున్నారు. పరిసరాల్లోని సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలిస్తున్నారు.