
ప్లాస్టిక్‌ను స్వచ్ఛందంగా నిషేధించాలి
● ప్రజలకు కలెక్టర్ ఆనంద్ పిలుపు
అనంతపురం అర్బన్/రాప్తాడు రూరల్: ‘‘పర్యావరణానికి ప్లాస్టిక్ చేటు చేస్తుంది. పర్యావరణం దెబ్బతింటే మానవ మనుగడకే ప్రమాదం. దీన్ని దృష్టిలో ఉంచుకుని ప్లాస్టిక్ వినియోగాన్ని స్వచ్ఛందంగా నిషేధించాలి’’ అని కలెక్టర్ ఓ.ఆనంద్ ప్రజలకు పిలుపునిచ్చారు. గురువారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ‘స్వచ్ఛతా హీ సేవా ఏక్‌దిన్.. ఏక్ గంట... ఏక్ సాథ్ (ఒకరోజు–ఒక గంట–అందరూ కలిసి)’లో కలెక్టర్ పాల్గొన్నారు. అనంతరం అనంతపురం రూరల్ మండలం కక్కలపల్లిలో సచివాలయం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కలెక్టరేట్‌ను తొలుత గ్రీన్ ఆఫీసుగా తీర్చిదిద్దుతామన్నారు. ప్లాస్టిక్ సంచులకు ప్రత్యామ్నాయంగా బట్ట, జనపనార సంచులు వాడుతూ, తోటి వారూ వాడేలా చైతన్యపర్చాలన్నారు. ఈ కార్యక్రమం ఒకరోజు చేయాల్సింది కాదని, ఇంట్లో మనం ఎలా శుభ్రం చేసుకుంటామో, అలాగే మన పరిసరాలను కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. పరిశుభ్రతలో మునిసిపల్, పంచాయతీ వర్కర్లకు ప్రజలు సహకారం అందించాలన్నారు. అనంతరం పర్యావరణహిత బట్ట బ్యాగులు పంపిణీ చేశారు. ప్రజలతో మమేకమై కలెక్టర్ చీపురు పట్టి పరిసరాలను శుభ్రం చేశారు. పిల్లిగుండ్ల కాలనీ సీతారాముల ఆలయ సమీపంలోని గ్రామ సచివాలయం వద్ద ఏర్పాటు చేసిన వైద్య శిబిరం, సంపూర్ణ పోషణ్ అభియాన్ కింద పౌష్టికాహార మాసోత్సవాల స్టాల్‌ను సందర్శించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ, అసిస్టెంట్ కలెక్టర్ సచిన్ రహర్, డీఆర్‌ఓ మలోల, నగరపాలక సంస్థ కమిషనర్ బాలస్వామి, జిల్లా పర్యాటక శాఖ అధికారి జయకుమార్‌బాబు, సర్పంచ్ కృష్ణయ్య,స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ డైరెక్టర్ భవాని శంకర్, జిల్లా పరిషత్ సీఈఓ శివశంకర్, డీపీఓ నాగరాజు నాయుడు, ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈ సురేష్ పాల్గొన్నారు.
రెవెన్యూ క్రీడోత్సవాల పోస్టర్ ఆవిష్కరణ
జిల్లా కేంద్రంలో రాష్ట్రస్థాయి రెవెన్యూ క్రీడలు, సాంస్కృతి ఉత్సవాలు నవంబరు 7,8,9 తేదీల్లో జరగనున్నాయి. ఇందుకు సంబంధించి పోస్టర్లను కలెక్టర్ గురువారం తన క్యాంపు కార్యాలయంలో రెవెన్యూ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షడు బొప్పరాజు వెంకటేశ్వర్లు, అధికారులతో కలిసి ఆవిష్కరించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఉద్యోగుల్లో స్నేహభావం, ఐక్యత, క్రీడాస్ఫూర్తి, సాంస్కృతిక విలువలు పెంపొందించేందుకు ఇలాంటి ఉత్స వాలు తోడ్పతాయన్నారు. అనంతరం లాటరీ విధానంలో డ్రెస్‌కోడ్‌ను ఎంపిక చేశారు. కార్యక్రమంలో రెవెన్యూ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్‌వీరాజేష్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు సోమశేఖర్, ఎఫ్‌ఎస్‌ఓ జి.రామకృష్ణారెడ్డి తదితరులున్నారు.