
పసి ప్రాణం ఉక్కిరిబిక్కిరి
అనంతపురం మెడికల్: పసి ప్రాణాన్ని మహమ్మారి పట్టుకుంటోంది. పాలు కూడా తీసుకోలేని స్థితికి తీసుకెళ్తోంది. ఊపిరి కూడా సలపనంతంగా ఆవరించి ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. జిల్లాలో ఇటీవల చిన్నారుల న్యుమోనియా కేసులు పెరుగుతున్నాయి.చాపకింద నీరులా మహమ్మారి వ్యాప్తి చెందుతుండడం అందరినీ కలవరపరుస్తోంది. అనంతపురం సర్వజనాస్పత్రిలోని చిన్నపిల్లల వార్డుల్లో న్యుమోనియా కేసులు రోజు రోజుకూ అధికమవుతున్నాయి. నిత్యం పదుల సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఆస్పత్రిలోని చిన్నపిల్లల వార్డులో రోజూ 40 నుంచి 60 అడ్మిషన్లు జరుగుతుండగా.. అందులో సగానికి పైగా వైరల్ న్యుమోనియా కేసులు ఉండడం గమనార్హం. గడిచిన నెలన్నరలో న్యుమోనియా బారిన పడిన వెయ్యి మంది చిన్నారులకు వైద్యులు చికిత్సలు అందించారంటే ఎంతగా ప్రబలిందో అర్థం చేసుకోవచ్చు.
వైద్యులను సంప్రదించాలి..
వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలుతాయి. అందులో న్యుమోనియా ఒకటి. మూడేళ్లలోపు పిల్లల్లో రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండడంతో ఎక్కువగా వ్యాధి బారిన పడతారు. ఇటీవల వాతావరణంలో తక్కువ ఉష్ణోగ్రతలు నమోదు కావడానికి తోడు రద్దీగా ఉండే ప్రాంతాల్లో పిల్లలను తిప్పడం వల్ల వ్యాధి మరింత వ్యాప్తి చెందుతుంది. మొదటగా జలుబుతో ప్రారంభమై దగ్గు, జ్వరం, ఆయాసం తదితర లక్షణాలు బయటపడుతాయి. అనంతరం చిన్నారులు తల్లిపాలను తీసుకునేందుకు కూడా ఇబ్బంది పడుతూ ఉక్కిరిబిక్కిరవుతారు. ఇటువంటి పరిస్థితుల్లో తల్లిదండ్రులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి. చిన్నారులకు అందించే ఆహారంలో శీతల పదార్థాలు లేకుండా చూసుకోవాలి. న్యుమోనియా లక్షణాలు కన్పిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి.
పడకల సమస్య..
సర్వజనాస్పత్రి చిన్నపిల్లల వార్డులో మూడు యూనిట్లలో 90 పడకలుంటే ప్రస్తుతం 187 మంది అడ్మిషన్‌లో ఉన్నారు. సగానికిపైగా న్యుమోనియా కేసులున్నాయి. వైరల్ ఫీవర్‌తో 42 మంది ఇబ్బంది పడుతున్నారు. వార్డులో సరిపడునన్ని పడకలు లేక పోవడంతో ఒకే మంచంపై ఇద్దరు, ముగ్గురిని ఉంచి వైద్య సేవలందించాల్సిన పరిస్థితి నెలకొంది. నెబులైజేషన్ కోసం క్యూ కట్టాల్సిన దుస్థితి నెలకొంది.
ప్రభుత్వాస్పత్రే మేలు..
సర్వజనాస్పత్రిలో చిన్నపిల్లల వైద్యులు న్యుమో నియా కేసులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుని సేవలందిస్తున్నారు. దీంతో చిన్నారులు వేగంగా కోలుకుంటున్నారు. రామగిరికి చెందిన దంపతులు ఇటీవల న్యుమోనియా బారిన పడిన తమ కుమారుడిని అనంతపురం నగర శివారులో ఉన్న ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ రూ.వేలల్లో ఖర్చు చేసినా బిడ్డ ఆరోగ్యంలో మార్పురాలేదు. వెంటిలేటర్‌పై ఉన్న పసికందును సర్వజనాస్పత్రికి తీసుకురాగా వైద్యులు మెరుగైన వైద్య సేవలందించడంతో ఇటీవల కోలుకుంటున్నాడు.
నిర్లక్ష్యం చేయొద్దు...
చిన్నారుల్లో వైరల్ న్యుమో నియా అధికమవుతోంది. మందుల షాపులు, ఆర్‌ఎంపీల వద్దకు వెళ్లి కౌంటర్ మెడిసిన్ వాడొద్దు. అందుబాటులో ఉన్న చిన్నపిల్లల వైద్యులను సంప్రదించాలి. చిన్నారుల ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయరాదు. – డాక్టర్ సంజీవయ్య, అసోసియేట్ ప్రొఫెసర్, జీజీహెచ్
వామ్మో న్యుమోనియా
జిల్లాలో ప్రబలుతున్న మహమ్మారి
జలుబు, దగ్గు, జ్వరంతో చిన్నారుల అవస్థలు
సర్వజనాస్పత్రిలో నిత్యం నమోదవుతున్న కేసులు
మారిన వాతావరణంతో రోగం బారిన పడుతున్న పసికందులు
‘ప్రైవేటు’ను ఆశ్రయిస్తూ
జేబులు గుల్ల చేసుకుంటున్న తల్లిదండ్రులు
సర్వజనాస్పత్రిలో
మెరుగైన చికిత్సలు