ప్రధాన పంటగా కంది | - | Sakshi
Sakshi News home page

ప్రధాన పంటగా కంది

Sep 25 2025 7:39 AM | Updated on Sep 25 2025 7:39 AM

ప్రధాన పంటగా కంది

ప్రధాన పంటగా కంది

అనంతపురం అగ్రికల్చర్‌: జిల్లాలో కంది ప్రధాన పంటగా అవతరిస్తోంది. గత కొన్ని దశాబ్ధాలుగా ఏక పంటగా లక్షలాది హెక్టార్లలో సాగవుతూ వస్తున్న వేరుశనగను వెనక్కినెట్టి కంది తొలిస్థానాన్ని ఆక్రమిస్తోంది. గత నాలుగైదు సంవత్సరాలుగా జిల్లా రైతులు కంది సాగుపై మొగ్గుచూపడమే ఇందుకు కారణం. 2024 ఖరీఫ్‌లో ఏకంగా 1.03 లక్షల హెక్టార్లలో కంది సాగులోకి రాగా ఈ ఖరీఫ్‌లో కూడా 1.01 లక్షల హెక్టార్లకు చేరుకుంది. ఈ–క్రాప్‌ ముగిస్తే కంది విస్తీర్ణం మరికొంత పెరిగే అవకాశమున్నట్లు సమాచారం. జిల్లా చరిత్రలో తొలిసారిగా కంది పంట వేరుశనగను దాటిపోవడం ఇదే తొలిసారి. గతేడాది కంది విస్తీర్ణం పెరిగినా... వేరుశనగను అధిగమించలేకపోయింది. ఈ సారి కంది తొలిస్థానంలో నిలవడం విశేషం. కంది సాధారణ సాగు విస్తీర్ణం 55,296 హెక్టార్లు కాగా 183 శాతంతో 1.01 లక్షల హెక్టార్లకు చేరుకుంది. గతంలో ఉమ్మడి జిల్లాలో కూడా ఈ స్థాయిలో కంది ఎన్నడూ సాగులోకి రాలేదు. ఉమ్మడి జిల్లాలో 2017లో అత్యధికంగా 71 వేల హెక్టార్లుగా నమోదైంది.

లక్ష హెక్టార్లలోపే వేరుశనగ

గత నలభైయేళ్లలో ఎన్నడూ లేని విధంగా ఈ సారి వేరుశనగ సాగు విస్తీర్ణం లక్ష హెక్టార్ల లోపే పరిమితమైంది. ఈ సారి 1.82 లక్షల హెక్టార్లు అంచనా వేయగా అతి కష్టంపై 89 వేల హెక్టార్లకు చేరుకుంది.పెట్టుబడులు పెరగడం, కూలీల సమస్య, అననుకూల వర్షాల వల్ల పంట దిగుబడులు తగ్గిపోవడం, చివరికి గిట్టుబాటు ధరలు కూడా లేకపోవడం, చీడపీడల వ్యాప్తి, అడవిపందులు, జింకల బెడద తదితర కారణాలతో వేరుశనగ పేరు వింటనే రైతులు బెదిరిపోతున్న పరిస్థితి నెలకొంది. దీంతో సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గిపోయింది. అలాగే నల్లరేగడి భూముల్లో పత్తి విస్తీర్ణం 44 వేల హెక్టార్లు అంచనా వేయగా అదనులో వర్షం పడకపోవడంతో 24 వేల హెక్టార్లకు పరిమితమైంది. గతంలో కొన్ని ప్రాంతాలకే పరిమితమైన మొక్కజొన్న ఇటీవల క్రమంగా పెరుగుతోంది. ఈ ఏడాది 14,653 హెక్టార్లు అంచనా వేయగా ఏకంగా 25,500 హెక్టార్లకు పెరిగింది. 16,293 హెక్టార్లు అంచనా వేసిన ఆముదం 15,406 హెక్టార్లకు చేరుకుంది. నీటి వనరులు పెరగడంతో 19,466 హెక్టార్లు అంచనా వేసిన వరినాట్లు 22,500 హెక్టార్లకు చేరుకుంది. సజ్జ 2,054 హెక్టార్లకు గానూ 3,583 హెకా్టార్లలో సాగైంది. రాగి, కొర్ర, ఉలవ, పెసర, అలసంద, మినుము, సోయాబీన్‌, పొద్దుతిరుగుడు తదితర పంటలు నామమాత్రపు విస్తీర్ణంలో సాగులోకి వచ్చినట్లు వ్యవసాయశాఖ తాజా నివేదిక వెల్లడి చేస్తోంది. మొత్తమ్మీద ఈ ఖరీఫ్‌లో 3,42,232 హెక్టార్లలో పంటలు సాగులోకి వస్తాయని అంచనా వేయగా... 83 శాతంతో 2,84,834 హెక్టార్ల విస్తీర్ణంలో రైతులు పంటలు సాగు చేశారు. ఈ క్రాప్‌ నమోదు పూర్తయితే ఖచ్చితమైన సాగు లెక్కలు అందుబాటులోకి రానున్నాయి.

గత రెండేళ్లుగా వేరుశనగ సాగుపై రైతుల్లో సన్నగిల్లుతున్న ఆసక్తి

ఈసారి 183 శాతంతో 1.01 లక్షల హెక్టార్లతో అగ్రస్థానంలో కంది

89 వేల హెక్టార్లకే పరిమితమైన వేరుశనగ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement