
సాయి సేవలు.. పేదల జీవితాలకు వెలుగులు
ప్రశాంతి నిలయం: ‘లవ్ ఆల్.. సర్వ్ ఆల్’’ సందేశాన్నిస్తూ సత్యసాయి ప్రపంచ మానవాళికి వెలకట్టలేని సేవలు అందించారని.. ఆయన సేవలు పేదల జీవితాలలో వెలుగులు నింపుతున్నాయని భక్తులు సంగీత నృత్యరూపకం ద్వారా చాటిచెప్పారు. పర్తియాత్రలో భాగంగా పుట్టపర్తికి విచ్చేసిన ఏలూరు సత్యసాయి భక్తులు ఆదివారం సాయంత్రం సాయికుల్వంత్ సభా మందిరంలో సత్యసాయి మహాసమాధి చెంత ‘దొరకునా ఇటువంటి సేవ’ పేరుతో సంగీత నృత్యరూపకం ప్రదర్శించారు. సత్యసాయి మానవాళికి అందించిన సేవలను, నేడు ప్రపంచ వ్యాప్తంగా సత్యసాయి సేవా సంస్థలు అందిస్తున్న సేవలను వివరిస్తూ నృత్యరూపకం సాగింది. ఉదయం శ్రీసత్యసాయి అష్టోత్తర నామావళిని జపించారు.
‘దుర్గం’లో
గంజాయి పట్టివేత
రాయదుర్గం: ఉమ్మడి జిల్లాలో ఎక్కడో ఒక చోట గంజాయి గుప్పుమంటూనే ఉంది. ఏదో ఒక రూపంలో దుండగులు తీసుకొస్తున్నారు. పోలీసులకు పట్టుబడుతున్నారు. తాజాగా రాయదుర్గం పట్టణంలో ఆదివారం రాత్రి అనుమానిత వ్యక్తులతో గంజాయి పట్టుబడినట్టు అర్బన్ సీఐ జయనాయక్ తెలిపారు. నిందితులు వేపరాళ్ల, కొత్తిగుట్టకు చెందిన వారై ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు. సమగ్రంగా విచారణ జరిపి వివరాలను సోమవారం విలేకర్ల సమావేశంలో వెల్లడిస్తామన్నారు. ఈ కేసులో ఎంత మంది నిందితులున్నా అరెస్టు చేసి జైలుకు పంపిస్తామని స్పష్టం చేశారు.