
ఈ–క్రాప్ తప్పకుండా చేయించుకోండి
గుత్తి రూరల్: పంటలు సాగు చేసిన ప్రతి రైతూ తప్పకుండా ఈ–క్రాప్ చేయించుకోవాలని జిల్లా వ్యవసాయ అధికారి ఉమామహేశ్వరమ్మ సూచించారు. జక్కలచెరువు గ్రామంలో మంగళవారం గుత్తి డివిజన్ ఏడీఏ వెంకట్రాముడుతో కలిసి ఆమె పత్తి పొలాలను పరిశీలించారు. రైతు నాగరాజు పొలంలో ‘పొలం పిలుస్తోంది’ కార్యక్రమం నిర్వహించి రైతులకు సలహాలు, సూచనలు ఇచ్చారు. ఈ సందర్భంగా ఉమామహేశ్వరమ్మ మాట్లాడుతూ గుత్తి మండలానికి 30 టన్నుల జిప్సమ్ వచ్చిందని రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రభుత్వ పథకాలు వర్తించాలంటే రైతులు ఈ–క్రాప్ బుకింగ్ చేయించుకోవాలన్నారు. పత్తి పంటలకు ఆశించే తెగుళ్లు, పురుగుల నివారణకు ఎరువుల యాజమాన్య పద్ధతులు పాటించాలన్నారు. అనంతరం గ్రామ శివారులోని వేరుశనగ, కంది, ఆముదం, సజ్జ ఇతర పంటలను పరిశీలించారు. కార్యక్రమంలో వ్యవసాయాధికారి ముస్తాక్ అహ్మద్, టెక్నికల్ ఏఓ శశికళ, రైతులు పాల్గొన్నారు.
జాబ్ మేళాలో 54మందికి ఉద్యోగాలు
యాడికి: మండల కేంద్రంలోని శ్రీవెంకటేశ్వర డిగ్రీ కళాశాలలో మంగళవారం నైపుణ్యాభివృద్ది సంస్థ, శిక్షణ సంస్థ ఉమ్మడిగా నిర్వహించిన జాబ్‌మేళాకు విశేష స్పందన లభించిందని ప్రిన్సిపాల్ హరినాథరెడ్డి తెలిపారు. 266 మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఇందులో 149 మంది అభ్యర్థులు ఎంపిక కాగా.. అందులో 54 మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, సిబ్బంది పాల్గొన్నారు.
తండ్రి వైద్య ఖర్చులకు తనయుడు చోరీల బాట
శివాజీనగర: తండ్రి వైద్యఖర్చుల కోసం తనయుడు చోరీలబాట పట్టి చివరకు కటకటాల పాలయ్యాడు. ఏపీలోని అనంతపురానికి చెందిన ఫీరోజ్ (24) అనే వ్యక్తిని బెంగళూరులోని వైట్‌ఫీల్డ్ పోలీసులు అరెస్ట్ చేసి రూ. 20 బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు.
తండ్రి క్యాన్సర్ చికిత్స కోసం
నిందితుడు ఫీరోజ్ తన భార్య, కుమారుడితో కలిసి హొసకోట అనుగొండనహళ్లి పరిధిలో నివాసముంటున్నాడు. డ్రైవర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఇతని తండ్రి మహమ్మద్ పాషా క్యాన్సర్‌తో బాధపడుతున్నాడు. చికిత్సకు డబ్బు లేక ఫిరోజ్ ఓసారి బైక్‌ను చోసి విక్రయించాడు. అనంతరం డ్రైవర్ వృత్తికి స్వస్తి పలికి బైక్ చోరీలపై దృష్టి పెట్టాడు. బెంగళూరులోని కాడుగోడి, వైట్‌ఫీల్డ్ మెట్రో స్టేషన్ల వద్ద, పార్కింగ్ స్థలాల్లో నిలిపిన బైక్‌లను చోరీ చేసి ఏపీలో విక్రయించి సొమ్ము చేసుకునేవాడు. బైక్ చోరీ కేసులు అధికం కావడంతో పోలీసులు నిఘా పెంచారు. ఎట్టకేలకు నిందితుడిని అరెస్ట్ చేసి వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. 12 బైక్‌లను సొంతదారులకు అప్పగించారు. మిగతా వాహనాలకు సంబంధించి చిరునామాల కోసం ప్రయత్నం చేస్తున్నారు.

ఈ–క్రాప్ తప్పకుండా చేయించుకోండి