
లాగిన్ ఆప్షన్.. కష్టాలు ఓపెన్
బొమ్మనహాళ్: కూటమి ప్రభుత్వం వచ్చాక రెవెన్యూ సమస్యలను సకాలంలో పరిష్కరించకపోగా కొత్త సమస్యలను సృష్టిస్తోంది. ఇన్నాళ్లూ సాఫీగా సాగిన మీ భూమి, భూ నక్షత్ర పోర్టల్‌లో మార్పులు తీసుకొచ్చింది. గత రెండు నెలలుగా మీ భూమి పోర్టల్‌కు ఓటీపీ లాగిన్‌ను ఏర్పాటు చేయడంతో క్షేత్రస్ధాయిలో సమస్యలు అధికమవుతున్నాయి. రైతులు, ప్రజలు తమ భూముల వివరాలను మీ భూమి పోర్టల్‌లో తెలుసుకోలేక అవస్ధలు పడుతున్నారు. అనంతపురం జిల్లాలో 4,31,677 హెక్టార్లు, శ్రీసత్యసాయి జిల్లాలో 2,89,601 హెక్టార్లు వ్యవసాయ భూములు ఉన్నాయి.
నెట్ స్పీడ్ లేకున్నా మొరాయింపే..
ఉమ్మడి అనంతపురం జిల్లాలోని అన్ని మండలాల్లో నెట్ వేగం అంతంత మాత్రమే. నగరాల్లో మాత్రమే 5జీ నెట్‌వర్క్ అందుబాటులో ఉంటుంది. గ్రామాల్లో నెట్‌వర్క్ సౌకర్యం సరిగా లేదు. ఈ క్రమంలో గ్రామాల్లో మీ భూమి వెబ్‌సైట్‌లో వివరాలు పొందేందుకు రైతులు ఓటీపీ నమోదు చేశాకే వెబ్‌ల్యాండ్ ఓపెన్ అవుతోంది. నెట్ స్పీడ్ లేకపోయినా మీ భూమి పోర్టల్ ఓపెన్ అవ్వని పరిస్ధితి. గ్రామాల్లో మీ భూమి పోర్టల్‌లో భూ వివరాలు పొందేందుకు రైతులు అష్టకష్టాలు పడాల్సిన దుస్ధితి ఏర్పడింది. గతంలోని సమగ్ర భూముల వివరాలన్నీ మాయమయ్యాయి. ప్రస్తుతం చాలా వరకు భూముల వివరాలు కనిపించడం లేదు. ఇదే సమయంలో పోర్టల్ మొరాయిస్తోంది. నెట్ సెంటర్ల వద్ద రోజంతా పడిగాపులు కాస్తున్నా అవసరమైన భూ పత్రాలను పొందలేకపోతున్నారు. భూ వివరాలను గతంలో ఇంటి వద్దే తెలుసుకునే వెసులుబాటు ఉండేది. ఫోన్‌లో కానీ, కంప్యూటర్‌లో కానీ క్షణాల్లో తమకు అవసరమైన భూ వివరాలను తెలుసుకునే వారు. పబ్లిక్ డొమైన్‌లో ఇప్పటి వరకు ఈ ప్రక్రియ సులువుగా ఉండేది. రైతులు తమకు అవసరం వచ్చినప్పుడల్లా 1బీ, అండగల్, ఎఫ్‌ఎంబీలను తీసుకునేవారు.
మొరాయిస్తున్న మీ భూమి పోర్టల్.. ఓపెన్ కాని భూ నక్షత్ర
వెబ్‌ల్యాండ్‌లో సకాలంలో తెరుచుకోని భూముల వివరాలు
ఇదే అదునుగా దోచేసుకుంటున్న మీ సేవ, నెట్ సెంటర్ల నిర్వాహకులు