సూపర్‌.. సేవలు పూర్‌ | - | Sakshi
Sakshi News home page

సూపర్‌.. సేవలు పూర్‌

Sep 24 2025 5:16 AM | Updated on Sep 24 2025 5:16 AM

సూపర్

సూపర్‌.. సేవలు పూర్‌

అనంతపురం సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రిలోని రేడియాలజీ విభాగంలో రోగికి స్కాన్‌ తీస్తున్న ఈమె పీజీ విద్యార్థిని. ఇక్కడ విధులు నిర్వర్తించాల్సిన రేడియాలజిస్టు ఎక్కడికి వెళారో తెలియని పరిస్థితి. అదేవిధంగా ఆస్పత్రిలోని సర్జికల్‌ గ్యాస్ట్రో ఎంటరాలజీ, న్యూరో సర్జరీ, ఎండోక్రైనాలజీ, నెఫ్రాలజీ, యూరాలజీ తదితర విభాగాల్లో కొందరు వైద్యులు, సిబ్బంది తూతూమంత్రంగా విధులను నిర్వహిస్తున్నారు. దీంతో రోగులు వైద్యం పొందడానికి గంటల తరబడి సమయం పడుతోంది.

అనంతపురం మెడికల్‌: పేరుకే సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి. సౌకర్యాలు, సేవలు మాత్రం ఆ స్థాయిలో ఉండడం లేదు. ఇక వైద్యులు, స్టాఫ్‌నర్సులు, సిబ్బంది ఇష్టానుసారంగా విధులు నిర్వర్తిస్తున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నగర శివారు ప్రాంతంలో ఈ ఆస్పత్రి ఉండడంతో ఎవరూ పట్టించుకునే పరిస్థితి లేకుండా పోయింది. కొందరు వైద్యులు విధులకు డుమ్మా కొట్టి పత్తా లేకుండా పోతుండడంతో గంటల తరబడి రోగులు నిరీక్షించాల్సిన దుస్థితి ఏర్పడుతోంది. సూపర్‌స్పెషాలిటీలో మౌలిక సదుపాయాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. వార్డుల్లో ఫ్లోరింగ్‌ సరిగా లేకపోవడంతో పాటు రోగులు ఇంటి నుంచే ఫ్యాన్లు తెచ్చుకునే పరిస్థితి నెలకొంది.

ఎలా పడితే అలా నిర్మాణాలు..

సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రిలో క్యాంటీన్‌కు కేటాయించిన ప్రాంతంలో క్యాజువాలిటీ పేరిట నిర్మాణాలు చేపడుతున్నారు. రూ.10.7 లక్షలతో పది పడకలు ఏర్పాటు చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. బాగా ఉన్న ఆస్పత్రిని కళావిహీనంగా మార్చేసేలా తీసుకున్న చర్యలు విమర్శలకు తావిస్తున్నాయి. వాస్తవంగా సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రిలో రూ.2 కోట్లతో క్రిటికల్‌ కేర్‌ బ్లాక్‌ ఏర్పాటు చేస్తున్నారు. అయినా, అనవసరంగా రూ.10 లక్షలు వెచ్చించడంతో పాటు భవనాన్ని భ్రష్టు పట్టిస్తున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. ఇదిలా ఉండగా క్యాజువాలిటీలో కేవలం రెండు పడకలు వేసి, అందులో గుజిరీని అలాగే వదిలేశారు. క్యాజువాలిటీలో సెంట్రల్‌ ఆక్సిజన్‌ సిస్టమ్‌, వెంటిలేటర్‌ తదితర సదుపాయాలు ఉండాలి. దీనికితోడు విధుల్లో ఉండాల్సిన సీఎంఓ అందుబాటులో లేకపోవడంతో స్టాఫ్‌నర్సు వైద్యం అందించాల్సిన పరిస్థితి వస్తోంది.

దెబ్బతిన్న ఫ్లోరింగ్‌..

సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రిలోని కార్డియాలజీ విభాగానికి సంబంధించి వార్డులో ఫ్లోరింగ్‌ దెబ్బతింది. వాస్తవంగా గుండె శస్త్రచికిత్సలు, సమస్యలున్న వారు పొరపాటున కిందకు పడితే వారి ప్రాణానికే ప్రమాదం. అటువంటిది సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రిలో కనీసం ఫ్లోరింగ్‌ కూడా వేయించలేని స్థితిలో అధికారులున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. కార్డియాలజీతో పాటు ఇతర విభాగాల్లోనూ మౌలిక సదుపాయాలు మృగ్యంగా మారాయి.

సూపర్‌.. సేవలు పూర్‌1
1/2

సూపర్‌.. సేవలు పూర్‌

సూపర్‌.. సేవలు పూర్‌2
2/2

సూపర్‌.. సేవలు పూర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement