
కూలిన బతుకులు
● రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకుల దుర్మరణం
రాప్తాడురూరల్: వారిద్దరూ టైల్స్ పని చేసే దినసరి కూలీలు. రోజులాగానే ఉదయం నుంచి సాయంత్రం దాకా పని చేసి బైకులో ఇంటికి బయలుదేరారు. మరో పది నిముషాల్లో ఇంటికి చేరుకుంటారనే లోపే మృత్యువు కబళించింది. రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు దుర్మరణం పాలైన ఘటన శుక్రవారం రాత్రి అనంతపురం రూరల్ మండలం సోములదొడ్డి సమీపంలో జాతీయ రహదారిపై చోటు చేసుకుంది. రూరల్ పోలీసులు తెలిపిన మేరకు... అనంతపురం నగరానికి చెందిన ముత్తూం బాషా (32), కుమార్ (23) టైల్స్ కార్మికులుగా పని చేస్తున్నారు. వీరిలో ముత్తూం బాషాకు వివాహమైంది. ఇద్దరు పిల్లలు సంతానం. గార్లదిన్నె సమీపంలో ఓ భవనంలో టైల్స్ పని చేస్తున్నారు. శుక్రవారం ఉదయం పనికి వెళ్లిన ఇద్దరూ సాయంత్రం ముగించుకుని ఇంటికి బయలు దేరారు. పామురాయి దాటిన తర్వాత సోములదొడ్డి సమీపంలో వెనుక నుంచి లారీ ఓవర్‌టేక్ చేసే క్రమంలో అదుపుతప్పి బైకును ఢీకొంది. ఈ క్రమంలో కింద పడిన ఇద్దరిపై లారీ చక్రాలు వెళ్లడంతో తీవ్రగాయాలై ఘటనా స్థలిలోనే దుర్మరణం చెందారు. లారీని రోడ్డుపైనే నిలిపేసి డ్రైవరు పరారవడంతో ట్రాఫిక్ స్తంభించింది. రూరల్ డీఎస్పీ వెంకటేశ్వర్లు, సీఐ శేఖర్, ఎస్‌ఐ రాంబాబు సిబ్బందితో ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు.
గుంతలే కొంప ముంచాయి!
జాతీయ రహదారిపై ఏర్పడిన గుంతలే ఇద్దరు ప్రాణాలు కోల్పోవడానికి కారణమయ్యాయని స్థానికులు మండిపడుతున్నారు. జాతీయ రహదారి నిర్వహణను పట్టించుకోకపోవడంతో గుంతలు పడి వాహనాల రాకపోకలకు తీవ్ర ఆటంకంగా మారాయన్నారు. స్పీడుగా వస్తున్న వాహనాలు గుంతలు తప్పించే క్రమంలో ప్రమాదాలకు గురవుతున్నాయన్నారు. ఉన్నతాధికారులు చర్యలు తీసుకుని ప్రమాదాలు జరగకుండా చూడాలని కోరుతున్నారు.