
నన్నే పక్కన నిల్చోమంటావా!
● ప్రిన్సిపాల్‌పై చేయిచేసుకున్న విద్యార్థి
● శెట్టూరు మోడల్ స్కూల్‌లో ఘటన
శెట్టూరు: సమాజంలో గురువుకు ప్రత్యేక స్థానం ఉంది.గురువును మించిన దైవం లేదని భావించే దేశం మనది. అలాంటి గురువుకు తన శిష్యుడి నుంచి తీవ్ర అవమానం జరిగింది. ప్రిన్సిపాల్‌పై విద్యార్థి దురుసుగా ప్రవర్తిస్తూ చేయి చేసుకున్నాడు. ఈ సంఘటన శెట్టూరు మండల కేంద్రంలోని ఏపీ మోడల్ స్కూల్లో శుక్రవారం చోటుచేసుకుంది. బాధిత ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు తెలిపిన వివరాల మేరకు.. పాఠశాలలో ఉదయం ప్రార్థన సమావేశానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆ సమయంలో ప్రిన్సిపాల్ శ్రీరాములు యూనిఫాం, షూ ధరించని విద్యార్థులను పక్కన నిల్చోవాలని సూచించారు. అయితే షూ ధరించని ఓ పదో తరగతి విద్యార్థి ‘నాకే చెప్తావా’ అంటూ వింత శబ్ధంతో ప్రిన్సిపాల్‌ను హేళన చేశాడు. ఈ క్రమంలోనే సదరు విద్యార్థిపై ప్రిన్సిపాల్ చేయి చేసుకోగా.. ఆగ్రహించిన విద్యార్థి ప్రిన్సిపాల్ గొంతు పట్టుకుని దాడికి దిగాడు. దీంతో ప్రిన్సిపాల్ చొక్కా చిరిగిపోయింది. ఉపాధ్యాయులు జోక్యం చేసుకుని గొడవను అడ్డుకున్నారు. తోటి ఉపాధ్యాయులు, విద్యార్థుల ముందు అవమానం జరగడంతో ప్రిన్సిపాల్ కన్నీటి పర్యంత మయ్యారు. విషయం తెలుసుకున్న డిప్యూటీ డీఈఓ శ్రీనివాసులు, డీఎస్పీ రవిబాబు, ఎంఈఓ శ్రీధర్ పాఠశాలకు చేరుకుని విచారణ చేపట్టారు. సదరు విద్యార్థి ప్రవర్తన ముందు నుంచీ దురుసుగానే ఉందని, గతంలో ఒక టీచర్‌ను బెదిరించాడని, గణితం టీచర్ పట్ల దురుసుగా ప్రవర్తించినట్లు తమ విచారణలో తేలిందని డిప్యూటీ డీఈఓ మీడియాకు తెలిపారు. పాఠశాలలో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు విద్యార్థిపై పోలీసుస్టేషన్‌లో కేసు పెట్టడంతో పాటు టీసీ ఇచ్చి పంపనున్నట్లు వెల్లడించారు.
ఇదే తరహాలో మరికొందరు విద్యార్థులు
ఏపీ మోడల్ పాఠశాలలో చరణ్‌తో పాటు మరికొందరు విద్యార్థులు దురుసుగా ప్రవర్తిస్తున్నట్లు ఉన్నతాధికారుల విచారణలో తేలింది. కొందరు విద్యార్థులకు తాగుడు, గుట్కా అలవాట్లు ఉన్నట్లు, ఉపాధ్యాయులతో పాటు తోటి విద్యార్థినులతో దురుసుగా ప్రవర్తిస్తున్నట్లు గుర్తించారు. ఇలాంటి విద్యార్థులకు వారి తల్లిదండ్రులతో మాట్లాడి ప్రత్యేక కౌన్సెలింగ్ ఇవ్వనున్నట్లు డిప్యూటీ డీఈఓ తెలిపారు.
నా కుమారుడి తప్పేమీ లేదు..
నా కుమారుడి తప్పేమీ లేదు. నా కుమారుడితో ప్రిన్సిపాల్ శ్రీరాములు దురుసుగా ప్రవర్తించారు. ప్రిన్సిపాల్ చేయి చేసుకోవడం వల్లే మావాడు వాదించాడు.
– సునీతమ్మ, విద్యార్థి తల్లి