
మహిళా లోక చైతన్య దీప్తి సావిత్రిబాయి పూలే
● విగ్రహావిష్కరణ సభలో జెడ్పీ చైర్‌పర్సన్ బోయ గిరిజమ్మ
అనంతపురం సిటీ: మహిళా లోకానికి చైతన్య దీప్తి సావిత్రిబాయిపూలే అని జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ బోయ గిరిజమ్మ అన్నారు. జిల్లా పరిషత్ క్యాంపస్‌లో తన సొంత నిధులతో ఏర్పాటు చేసిన సావిత్రిబాయి పూలే విగ్రహాన్ని ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, ఎమ్మెల్సీ మంగమ్మ, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల జాయింట్ కలెక్టర్లు శివ్‌నారాయణ్ శర్మ, అభిషేక్ కుమార్, జెడ్పీ వైస్ చైర్మన్లు వేదాంతం నాగరత్నమ్మ, సుధాకర్‌రెడ్డి, జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలతో కలసి బుధవారం ఆమె లాంఛనంగా ప్రారంభించి, మాట్లాడారు. విద్య ద్వారానే సీ్త్ర విముక్తి సాధ్యమని బలంగా నమ్మిన సావిత్రిబాయి పూలే తొలుత తానే విద్యాభ్యాసం మొదలుపెట్టి తొలి మహిళా ఉపాధ్యాయినిగా మహిళా లోకానికి ఆదర్శంగా నిలిచారని కొనియాడారు. జెడ్పీ క్యాంపస్‌లో జ్యోతిబా పూలే విగ్రహం ఉండగా..దాని పక్కనే మహిళా లోకానికే మహారాణిగా మారిన సావిత్రిబాయి పూలే విగ్రహాన్ని ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందన్నారు. పూలే దంపతుల జీవితాలను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకొని వారి ఆశయ సాధన కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ శంకర్, డిప్యూటీ సీఈఓ సుబ్బయ్య, ఎస్సీ, ఎస్టీ సంఘాల జేఏసీ అధ్యక్షుడు సాకే హరి, అన్ని శాఖల అధికారులు, ప్రజా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.