
కుటీర పరిశ్రమల ఏర్పాటుకు ప్రోత్సాహం
● పీఎంఎఫ్‌ఎంఈ కింద 35 శాతం రాయితీ
● ఎఫ్‌పీఎస్ ఈఓలు ఉమాదేవి, చంద్రశేఖర్
అనంతపురం అగ్రికల్చర్: ఆహారశుద్ధికి సంబంధించి కుటీర పరిశ్రమల ఏర్పాటుకు ముందుకు వచ్చే ఔత్సాహిక ఎంటర్‌ప్రెన్యూర్స్‌కు రాయితీలతో ప్రోత్సహిస్తున్నట్లు రెండు జిల్లాల ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ (ఎఫ్‌పీఎస్) ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ (ఈఓలు) డి.ఉమాదేవి, జి.చంద్రశేఖర్ శనివారం తెలిపారు. ప్రధానమంత్రి ఆహారశుద్ధి క్రమబద్ధీకరణ పథకం (పీఎం ఎఫ్‌ఎంఈ) కింద ఆసిక్తి కలిగిన వ్యాపారవేత్తలు, యువత, నిరుద్యోగులు, మహిళలు, రైతులు, ఎఫ్‌పీఓలు, రైతు సహకార సంఘాలు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. మహిళా పొదుపు సంఘాలకు ప్రాధాన్యత ఉంటుందన్నారు. చిన్నపాటి కుటీర పరిశ్రమల ఏర్పాటు వల్ల స్వయం సమృద్ధి సాధించడంతో పాటు నలుగురికి ఉపాధి కల్పించాలనేదే ముఖ్య ఉద్దేశమన్నారు. ప్రాజెక్టు విలువలో 10 శాతం లబ్ధిదారులు భరిస్తే... 35 శాతం ప్రభుత్వం రాయితీ రూపంలో ఇస్తుందన్నారు. మిగతా 55 శాతం బ్యాంకుల ద్వారా రుణసదుపాయం కల్పిస్తామని తెలిపారు. ఇందులో గరిష్టంగా రూ.10 లక్షల వరకు రాయితీ వర్తిస్తుందన్నారు. జిల్లాలో వేరుశనగ ఆధారిత ఉత్పత్తుల తయారీ యూనిట్లు అంటే వేరుశనగ నూనె, చిక్కీల తయారీ లాంటికి ప్రాధాన్యత ఇస్తూనే... సోలార్ డీహైడ్రేషన్, పొటాటో చిప్స్, చెక్కిలాలు, ఊరగాయలు, రోటీ మేకర్, మసాలా పొడులు, అల్లం వెల్లుల్లి పేస్ట్, రెడీ టు ఈట్ ప్రొడక్ట్స్, శనగపప్పు, బేకరీ ఉత్పత్తులు, జెల్లీ, సాస్, మిల్లెట్ ఆధారిత ఉత్పత్తులు, బొరుగులు, రైస్ బేస్డ్ ప్రొడక్ట్స్, చింతపండు తదితర మరో 20 నుంచి 30 రకాల ఉత్పత్తుల తయారీకి రాయితీలతో ప్రోత్సహిస్తామని తెలిపారు. మరిన్ని వివరాలకు అనంతపురం జిల్లా ఈఓ డి.ఉమాదేవి (79950 86792), రీసోర్స్ పర్సన్ బి.హరీష్ (96767 96974), అలాగే శ్రీసత్యసాయి జిల్లా ఈఓ చంద్రశేఖర్ (79950 86791), రీసోర్స్ పర్సన్ (78933 47474)ను సంప్రదించాలని సూచించారు.