అస్పష్టత.. అయోమయం | - | Sakshi
Sakshi News home page

అస్పష్టత.. అయోమయం

Sep 8 2025 5:52 AM | Updated on Sep 8 2025 5:52 AM

అస్పష్టత.. అయోమయం

అస్పష్టత.. అయోమయం

డీఎస్సీ–25 సర్టిఫికెట్ల పరిశీలన

ప్రక్రియలో పొరబాట్లు

తల పట్టుకుంటున్న అధికారులు

అన్ని సబ్జెక్టులను కలపడంతోనే దుస్థితి

అనంతపురం ఎడ్యుకేషన్‌: డీఎస్సీ–25పై కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు అటు అభ్యర్థులు, ఇటు వెరిఫికేషన్‌ అధికారులను తీవ్ర గందరగోళానికి గురి చేస్తున్నాయి. గతంలో డీఎస్సీ నిర్వహణలో మెరిట్‌ జాబితాలు ప్రకటించగానే సబ్జెక్టుల వారీగా నిపుణులను ఏర్పాటు చేసుకుని సర్టిఫికెట్ల పరిశీలన ప్రక్రియ చేపట్టేవారు. కేటాయించిన సబ్జెక్టులో మెరిట్‌ సమస్య ఉత్పన్నమైనా ఎక్కడ పొరబాటు జరిగిందో ఇట్టే తెలిసిపోయేది. వెంటనే సరిదిద్దేవారు. తర్వాత ఎంపిక జాబితాను ప్రకటించేవారు. అయితే కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో అభ్యర్థులను పక్కన పెడితే సంబంధిత అధికారులకే స్పష్టత లేక తలలు పట్టుకుంటున్నారు. సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ పూర్తయినా రీవెరిఫికేషన్‌, క్రాస్‌ వెరిఫికేషన్‌ దుస్థితి తలెత్తుతుండడంతో టెన్షన్‌ పడుతున్నారు. జిల్లాలో మొత్తం 807 వివిధ కేటగిరీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేశారు. మెరిట్‌ జాబితా విడుదల చేసినా ఏ పోస్టులో ఏయే కేటగిరీ అభ్యర్థులకు ఎక్కడ మొదలై, ఎక్కడ కటాఫ్‌ అవుతుందనే వివరాలు లేవు. నేరుగా అభ్యర్థుల మొబైళ్లకు కాల్‌ లెటర్లు పంపి ఆ జాబితా మాత్రమే విద్యాశాఖ అధికారులకు పంపారు. తమకంటే తక్కువ మార్కులు వచ్చిన వారికి సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు పిలిచారంటూ చాలామంది అభ్యర్థులు అధికారులకు ఫిర్యాదులు చేస్తున్నారు. వాస్తవానికి తక్కువ మార్కులు వచ్చిన వారు ఏదో ఒక రిజర్వేషన్‌ కేటగిరీ కింద వచ్చి ఉంటారు. పూర్తిస్థాయి జాబితా అధికారుల వద్ద లేకపోవడంతో దీనిపై స్పష్టత ఇవ్వలేక వారు అయోమయానికి గురవుతున్నారు.

జిల్లాలో సర్టిఫికెట్ల పరిశీలనకు మొత్తం 16 టీంలు ఏర్పాటు చేశారు. ఒక టీంకు ఒక సబ్జెక్టు అభ్యర్థులను కేటాయించి ఉంటే ఆ సబ్జెక్టుకు ఏయే సర్టిఫికెట్లు ఉండాలనేది ఒకటికి రెండుసార్లు పరిశీలించి అన్నీ కరెక్టుగా ఉన్నాయా...లేదా అని చూసేందుకు సులువుగా ఉండేది. ఎస్జీటీ, ఎస్జీటీ కన్నడ, ఉర్దూ, స్కూల్‌ అసిస్టెంట్‌ అన్ని సబ్జెక్టులు, టీజీపీ, పీజీటీ అన్ని సబ్జెక్టులు, ప్రిన్సిపాల్స్‌, పీడీ, పీఈటీ ఇలా మొత్తం 16–20 సబ్జెక్టుల అభ్యర్థులను ప్రతిటీంకూ కేటాయించడం సమస్యగా మారింది. ఒక్కో టీం అన్ని సబ్జెక్టులకు సంబంధించి 50 మంది అభ్యర్థుల సర్టిఫికెట్లను పరిశీలించారు. ఆయా బృందాల అధికారులు తికమకపడ్డారు. ఈ గందరగోళ పరిస్థితుల్లోనే చిన్న పొరబాటు జరిగినా అర్హుడు అనర్హత జాబితాలోకి, అనర్హుడు అర్హత జాబితాలోకి వెళ్లే ప్రమాదం ఉంది. ఒత్తిడిలో కొన్ని తప్పులు జరిగాయి. స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టుకు డిగ్రీలో 50 శాతం మార్కులు ఉండాలి. 2017కు ముందు ఉత్తీర్ణత సాధించిన వారికి ఈ నిబంధన వర్తించదు. 2011లో 48 శాతంతో డిగ్రీ ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థిని పొరబాటున అనర్హత జాబితాలోకి చేర్చారు. మళ్లీ సరిదిద్దారు. ఇలా రీవెరిఫికేషన్‌, క్రాస్‌ వెరిఫికేషన్‌ సమయంలో 10 మంది అభ్యర్థుల సర్టిఫికెట్ల నమోదులో జరిగిన పొరబాట్లను గుర్తించారు. ఈ క్రమంలో సర్టిఫికెట్ల పరిశీలన చేస్తున్న ప్రతిసారీ పొరపాట్లు బయటపడుతుండడం అధికారులను కలవరపెడుతోంది.

దరఖాస్తు సమయంలోనే అభ్యర్థుల నుంచి ‘ప్రిఫరెన్స్‌’ తీసుకోవడంతో సమస్య నెలకొంది. ఎస్జీటీ, ఎస్‌ఏ, టీజీటీ, పీజీటీ, ప్రిన్సిపాల్‌ ఇలా చాలా మంది అభ్యర్థులు 2,3,4 పోస్టులకు ఎంపికయ్యారు. అవగాహన లేక పోస్టుల సంఖ్యను దృష్టిలో ఉంచుకుని ఎస్జీటీ పోస్టుకు తొలి ప్రాధాన్యత ఇచ్చారు. ఇప్పుడు అదే వారిపాలిట శాపంగా మారింది. ఇదే పోస్టు తీసుకోవాల్సిందేనని అధికారులు స్పష్టం చేయడంతో కొందరు అభ్యర్థులు తెలివిగా సర్టిఫికెట్ల పరిశీలన సమయంలో ఎస్జీటీ సర్టిఫికెట్లు లేవని చెప్పారు. ఎస్జీటీ సర్టిఫికెట్లు లేకుంటే తర్వాత (ఎస్‌ఏ, పీజీటీ, టీజీటీ) పోస్టు ఇస్తారు. ఎన్ని పోస్టులకు ఎంపికై ఉంటే అన్ని పోస్టుల సర్టిఫికెట్లు జత చేస్తేనే అర్హుల జాబితాలో చేర్చాలని, లేదంటే అనర్హులుగా పరిగణించాలంటూ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. దీంతో అధికారులు ఆయా అభ్యర్థుల వెంట పడి మరీ సర్టిఫికెట్లను తెప్పించుకుని రీ వెరిఫికేషన్‌ చేశారు.

ఒత్తిడిలో తప్పులు..

‘ప్రిఫరెన్స్‌’తోనే తంటా..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement