
నేడు కలెక్టరేట్‌లో పరిష్కార వేదిక
అనంతపురం అర్బన్: ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించనున్నట్లు కలెక్టర్ వి. వినోద్‌కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. రెవెన్యూ భవన్‌లో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు కార్యక్రమం జరుగుతుందన్నారు. ప్రజలు తమ సమస్యలను అర్జీల రూపంలో అధికారులకు సమర్పించాలన్నారు. అర్జీతో పాటు ఫోన్, ఆధార్ నంబర్లు తప్పనిసరిగా ఇవ్వాలని సూచించారు. గతంలో అర్జీ ఇచ్చి ఉంటే దానికి సంబంధించి రసీదు తీసుకురావాలన్నారు. కాల్‌సెంటర్ 1100కు ఫోన్ చేసి అర్జీ స్థితిని తెలుసుకోవచ్చన్నారు. అర్జీలను ‘పరిష్కార వేదిక’లోనే కాకుండా meekosam.ap.gov.in వెబ్‌సైట్‌లోకి వెళ్లి ఆన్‌లైన్‌లోనూ సమర్పించవచ్చని తెలియజేశారు. ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు.
కసాపురం ఆలయం మూసివేత
గుంతకల్లు రూరల్: కసాపురం నెట్టికంటి ఆంజనేయస్వామి దేవస్థానాన్ని ఆదివారం మూసివేశారు. రాత్రి 9.50 నుంచి 12.24 గంటల వరకూ సంపూర్ణ చంద్రగ్రహణం నేపథ్యంలో శనివారం మధ్యాహ్నం ఒంటి గంటకే ఆలయంలో మధ్యాహ్నిక, సాయంకాల ఆరాధనలు, హారతులు నిర్వహించిన అనంతరం ఆలయాన్ని మూసివేశారు. గ్రహణం అనంతరం సోమవారం వేకువజామున ఆలయ శుద్ధి, సంప్రోక్షణతో మూలవిరాట్‌కు నిత్యాభిషేకం నిర్వహించి ఉదయం 6 గంటల నుంచి భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తారు.
మౌనగిరి క్షేత్రంలో
కర్ణాటక హైకోర్టు జడ్జి
రాప్తాడు: మండలంలోని హంపాపురం వద్ద 44వ జాతీయ రహదారి సమీపంలో ఉన్న మౌనగిరి క్షేత్రాన్ని జిల్లా అదనపు జడ్జి సత్యవాణితో కలసి ఆదివారం కర్ణాటక హైకోర్టు జడ్జి దేవదాస్ దంపతులు సందర్శించారు. ఈ సందర్భంగా వారికి క్షేత్రం పీఠాధిపతి ఈశ్వరయ్యస్వామి పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. క్షేత్రంలోని ఏకశిలా ఆంజనేయస్వామి విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం తీర్థ ప్రసాదాలను అందజేశారు. అనంతరం ఆలయ సమీపంలో దక్షిణమూర్తి దేవాలయ నిర్మాణానికి న్యాయమూర్తి దంపతులు భూమిపూజ చేశారు.

నేడు కలెక్టరేట్‌లో పరిష్కార వేదిక

నేడు కలెక్టరేట్‌లో పరిష్కార వేదిక