
బసంపల్లిలో మృతదేహం ఖననానికి అడ్డంకులు
చెన్నేకొత్తపల్లి: మండలంలోని బసంపల్లిలో మాల సామాజిక వర్గానికి చెందిన నారాయణ (85) ఆదివారం వేకువజామున మృతి చెందాడు. స్థల సమస్య కారణంగా ఖననానికి ఇబ్బందులు ఎదురుకావడంతో మృతదేహాన్ని ఇంటి వద్దే ఉంచుకోవడం కలకలం రేపింది. గ్రామంలో దళితుల శ్మశాన స్థల వివాదం కొన్నేళ్లుగా కొనసాగుతోంది. అదే గ్రామానికి చెందిన సత్యనారాయణ, ఆనంద్, ప్రకాష్‌తో పాటు దళిత వర్గీయుల మధ్య స్థల వివాదం ప్రస్తుతం కోర్టులో నడుస్తోంది. దీంతో దళితుల కుటుంబాల్లో ఎవరు మరణించినా వారి మృతదేహాన్ని ఖననం చేయాలంటే ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ప్రస్తుతం నారాయణ కుటుంబం ఎదుర్కొంటున్న ఇబ్బందిని తెలుసుకున్న తహసీల్దార్ సురేష్‌కుమార్, ఎస్‌ఐ సత్యనారాయణ గ్రామానికి చేరుకుని ఇరువర్గాలతో చర్చించారు. ప్రస్తుతం శ్మశాన స్థల వివాదం కోర్టులో ఉందని, పరిష్కారం అయ్యే వరకూ మృతదేహాలను మరో చోట ఖననం చేయాలని సూచించారు. అయితే.. ఆనవాయితీ మేరకు అదే స్థలంలోనే ఖననం చేసేలా అనుమతులు ఇవ్వాలని అధికారులను దళితులు కోరారు.