
●ఇసుకాసురుల పాపం.. ఇదే సాక్ష్యం
కూటమి ప్రభుత్వం వచ్చాక ఇసుకాసురులకు హద్దే లేకుండా పోయింది. కాసుల కక్కుర్తితో యథేచ్ఛగా ఇసుకను కొల్లగొడుతున్నారు. వారు చేస్తున్న పాపాలు సామాన్యులకు శాపాలుగా మారాయి.అందుకు ప్రత్యక్ష సాక్ష్యమే ఈచిత్రం. బొమ్మనహాళ్ మండలం కల్లుదేవనహళ్లి వద్ద హగరి నదిలో గతంలో చేతి పంపు ఏర్పాటు చేశారు. చంద్రబాబు ప్రభుత్వం కొలువుదీరినప్పటి నుంచి హగరి నదిలో ఇసుక కొల్లగొట్టడం ప్రారంభించిన ‘పచ్చ’ నేతలు.. నదిలోని చేతి పంపు చుట్టూ ఇసుక తోడేసి గుంతలు మిగిల్చారు. ఇటీవల కురుస్తున్న వర్షాలకు వేదావతి హగరి పొంగి ప్రవహించడంతో చేతి పంపు చుట్టూ ఉన్న కొద్దిపాటి ఇసుక కూడా కొట్టుకుపోయింది. దీంతో ప్రస్తుతం అందనంత ఎత్తుకు చేతి పంపు చేరింది. ఒకప్పుడు సులువుగా నీటిని పట్టుకున్న స్థానికులు నేడు అవస్థలు పడాల్సిన దుస్థితి నెలకొంది. కల్లుదేవనహళ్లిలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉన్నా అధికారులు పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయాన్ని ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈఈ శీనానాయక్ దృష్టికి తీసుకెళ్లగా,పరిశీలించి చర్యలు చేపడతామని ఆయన చెప్పారు.
– బొమ్మనహాళ్: