
ఇమామ్‌లు, మౌజన్‌లకు బాబు మొండిచేయి
● గౌరవ వేతనం ఇవ్వనందుకు 8న నిరసన
అనంతపురం కార్పొరేషన్: కూటమి ప్రభుత్వం గత 11 నెలలుగా ఇమామ్ (రూ.10వేలు ఒక్కొక్కరికి), మౌజన్‌లకు(రూ.5వేలు) గౌరవ వేతనం ఇవ్వకుండా మొండి చేయి చూపుతోందని వైఎస్సార్‌సీపీ అనుబంధ మైనార్టీ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాగజ్‌ఘర్ రిజ్వాన్, జిల్లా అధ్యక్షుడు సైఫుల్లాబేగ్ ధ్వజమెత్తారు. ఈ నెల ఎనిమిదిన కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన తెలియజేసి, అనంతరం కలెక్టర్‌కు వినతిపత్రం అందిస్తామని తెలిపారు. శనివారం వారు విలేకరులతో మాట్లాడారు. ఎన్నికలకు ముందు కూటమి మేనిఫెస్టోలో ఇమామ్, మౌజన్‌లకు గౌరవవేతనం ఇస్తామని చెప్పి మాట తప్పారన్నారు. సీఎం చంద్రబాబు ముస్లిం మైనార్టీల పట్ల కపటప్రేమ ప్రదర్శిస్తున్నారన్నారు. మైనార్టీల అభ్యున్నతికి దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ కుటుంబం చొరవ తీసుకుందన్నారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మరో రెండు అడుగులు ముందుకేసి మైనార్టీలను ఆదుకున్న విషయాన్ని గుర్తు చేశారు. ఈ నెల 10న జిల్లాలో కూటమి ప్రభుత్వం ‘సూపర్ సిక్స్– సూపర్ హిట్’ సభ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తుండటం సిగ్గుచేటన్నారు. ఏం ఉద్ధరించారని ఏర్పాటు చేస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. ప్రభుత్వానికి బుద్ధి చెప్పే రోజులు దగ్గర్లోనే ఉన్నాయన్నారు. కార్యక్రమంలో మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ ఫయాజ్, నాయకులు కొర్రపాడు హుస్సేన్ పీరా, కమర్‌తాజ్, మన్సూర్‌బాషా, రహంతుల్లా, ఖాజా, ఖాజీపీరా, దాదాఖలందర్, ఆసిఫ్, మహబూబ్‌బాషా, జావేద్, ఖాదర్ పాల్గొన్నారు.