
అన్నదాతలతో చెలగాటం
కూటమి ప్రభుత్వం అన్నదాతలతో చెలగాటమాడుతోంది. బోరుబావుల కింద సాగు చేసుకుంటున్న పంటల అవసరానికి తగ్గట్లు యూరియా అందించకపోవడంతో ఇప్పటికే రైతులు అల్లాడిపోతున్నారు. మరోవైపు రిజర్వాయర్లలో నీరున్నా ఆయకట్టు భూములకు వదలకుండా నిర్లక్ష్య ధోరణి ప్రదర్శిస్తుండడంతో రైతన్నలకు దిక్కుతోచడం లేదు.
అనంతపురం సెంట్రల్: వర్షాలకు తుంగభద్ర, శ్రీశైలం జలాశయాలు పొంగిపొర్లుతున్నాయి. నెలన్నర రోజులుగా గేట్ల ద్వారా దిగువకు నీరెళ్లిపోతోంది. ఈ సమయంలో జిల్లాలో ఆయకట్టుకు ఎలాంటి ఢోకా ఉండదని అందరూ భావించారు. కానీ కూటమి ప్రభుత్వంలో అందుకు పూర్తి భిన్నమైన పరిస్థితులు నెలకొన్నాయి. కీలకమైన సాగునీటి సలహామండలి (ఐఏబీ) సమావేశం నిర్వహించకపోవడంతో ఆయకట్టు భూములు ఇప్పటికీ బీడుగా దర్శనమిస్తున్నాయి. మంత్రులు, ప్రజాప్రతినిధులకు తీరిక లేకపోవడంతో సమావేశానికి ముహూర్తం కుదరడం లేదని తెలిసింది.
గత ప్రభుత్వంలో జూలైలోనే..
ఆగస్టులోపే ఐఏబీ సమావేశం నిర్వహించడం ఆనవాయితీ. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో ఏటా జూలైలోనే సమావేశం నిర్వహించేవారు. ఉపకాలువలకు ఎప్పటి నుంచి నీటిని విడుదల చేస్తారు.. ఎన్ని రోజులు వదులుతారు.. తదితర వివరాలు అధికారికంగా ప్రకటించేవారు. దీనికి తగ్గట్టుగా రైతులు పంటలు సాగు చేసుకునేవారు. కానీ, కూటమి ప్రభుత్వంలో పరిస్థితి పూర్తి భిన్నంగా మారడంతో రైతులకు దిక్కుతోచని పరిస్థితి.
నెలరోజులుగా తిరుగుతున్నా...
ఐఏబీ సమావేశం నిర్వహణ తేదీ ఖరారు కోసం ప్రజాప్రతినిధుల చుట్టూ అధికారులు కాళ్లరిగేలా తిరుగుతున్నా స్పందన లేదు. బిజీగా ఉన్నామంటూ తిప్పి పంపిస్తున్నట్లు సమాచారం. జిల్లాకు చెందిన ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ అపాయింట్ మెంట్ అసలు దొరకడమే లేదని తెలిసింది. ఆయకట్టుకు నీరందిస్తే త్వరితగతిన పంటలు సాగు చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఖరీఫ్ సీజన్ ముగిసి రబీలోకి ప్రవేశిస్తున్నా నీరివ్వకపోవడంతో పంట దిగుబడులపై తీవ్ర ప్రభావం పడుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అనంతపురం వద్ద బోసిపోతున్న తుంగభద్ర ఎగువ కాలువ
ఐఏబీ వెంటనే నిర్వహించాలి
ఐఏబీ సమావేశాన్ని వెంటనే ఏర్పాటు చేయాలి. ఆగస్టులోనే సమావేశం నిర్వహించాల్సి ఉంది. గత నెల 25న జరిగిన జిల్లా రివ్యూ కమిటీ సమావేశంలో నేను ప్రత్యేకంగా ఈ విషయాన్ని ప్రస్తావించా. ఆయకట్టుకు నీరు ఎప్పుడు వదులుతారు.. ఎంత కాలం నీటి లభ్యత ఉంటుందనే విషయాలపై స్పష్టత లేక రైతులు పంటలు సాగు చేసుకోలేకపోతున్నారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ వినోద్‌కుమార్ స్పందించి ఐఏబీ సమావేశం ఏర్పాటు చేయాలి.
– వై.శివరామిరెడ్డి,ఎమ్మెల్సీ
త్వరలో తేదీ ఖరారు
ఈ ఏడాది తుంగభద్ర, శ్రీశైలం జలాశయాలు నిండడంతో జిల్లాకు త్వరగా నీరు వస్తోంది. హెచ్చెల్సీతో పాటు హంద్రీ–నీవా ద్వారా వస్తున్న నీటిని పీఏబీఆర్, ఎంపీఆర్‌లలో నిల్వ చేస్తున్నాం. త్వరలో కలెక్టర్, ప్రజాప్రతినిధుల అనుమతి తీసుకొని సాగునీటి సలహా మండలి సమావేశం నిర్వహిస్తాం.
–సుధాకర్‌రావు, ఎస్‌ఈ, హెచ్చెల్సీ
ఐఏబీ సమావేశం నిర్వహణలో అంతులేని నిర్లక్ష్యం
ప్రజాప్రతినిధులకు తీరిక లేక కుదరని ముహూర్తం