
వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోండి
● ఇన్‌చార్జ్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ
అనంతపురం అర్బన్: ‘వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో పంచాయతీల పరిధిలో పారిశుధ్య నిర్వహణ పక్కాగా నిర్వహించేలా చూడండి. డెంగీ, మలేరియా తదితర సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోండి’ అని ఇన్‌చార్జ్ కలెక్టర్ శివ్‌నారాయణ్ శర్మ అన్నారు. వివిధ అంశాలపై బుధవారం కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాలు నుంచి డివిజన్, మండల, గ్రామస్థాయి అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో పారిశుధ్య నిర్వహణను నిర్లక్ష్యం చేయవద్దని ఆదేశించారు. తాగునీటి వనరులు కలుషితం కాకుండా చూడాలన్నారు. దోమలు వ్యాప్తి చెందకుండా చర్యలు చేపట్టాలన్నారు. ఇంటింటి నుంచి చెత్తను తప్పనిసరిగా సేకరించాలని చెప్పారు. ప్రజలు తమ నివాస పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకునేలా చూడాలన్నారు. సీఎస్‌డీటీలు చౌక దుకాణాలను తనిఖీ చేసి నిత్యావసర సరుకులు సక్రమంగా పంపిణీ జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అందిన అర్జీలకు సరైన పరిష్కారం చూపకపోవడంతో అవి రీ–ఓపెన్ అవుతున్నాయని, గుంతకల్లు, ఉరవకొండ, బొమ్మనహాళ్, పామిడి, యల్లనూరు, యాడికి తదితర మండలాల్లో అర్జీల రీ–ఓపెన్ అధికంగా ఉందన్నారు. అర్జీదారులు సంతృప్తి చెందేలా పరిష్కారం చూపాలన్నారు.కార్యక్రమంలో ఆర్డీఓ కేశవనాయుడు, డీఎస్‌ఓ వెంకటేశ్వర్లు, హౌసింగ్ పీడీ శైలజ, సర్వే శాఖ ఏడీ రూప్లానాయక్, పీజీఆర్‌ఎస్ తహసీల్దారు వాణిశ్రీ, విభాగాల సూపరింటెండెంట్లు యుగేశ్వరిదేవి, రియాజుద్ధీన్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
జిల్లా అంతటా వర్షం
అనంతపురం అగ్రికల్చర్: ఎట్టకేలకు వరుణుడు కరుణించాడు. జిల్లా అంతటా వాన కురిసింది. మంగళవారం రాత్రి నుంచి బుధవారం ఉదయం వరకు బొమ్మనహాళ్ మండలంలో మినహా మిగతా 30 మండలాల పరిధిలో 31.5 మి.మీ సగటు వర్షపాతం నమోదైంది. గుత్తి 71.4 మి.మీ, పెద్దవడుగూరు 70.4, గుంతకల్లు 68.2, రాయదుర్గం 64.2, పామిడి 53.2, అనంతపురం 48.4, నార్పల 45.4, కళ్యాణదుర్గం 40.4, గుమ్మఘట్ట 40.2, విడపనకల్లు 39 మి.మీ, బెళుగుప్ప 37.2, బుక్కరాయసముద్రం 36.2, శింగనమల 33.6, వజ్రకరూరు 32.6, బ్రహ్మసముద్రం 30, తాడిపత్రి 27.4, ఆత్మకూరు 26.5, ఉరవకొండ 24, గార్లదిన్నె 20.6 మి.మీ వర్షపాతం నమోదైంది. మిగతా మండలాల్లో మోస్తరు నుంచి తేలికపాటి వర్షం కురిసింది. ఆగస్టు సాధారణ వర్షపాతం 83.8 మి.మీ కాగా ఇప్పటికే 54.3 మి.మీ నమోదైంది.
సిద్ధం కాని ‘ప్రత్యామ్నాయం’
వర్షాలకు జిల్లా అంతటా దాదాపు పదును అయింది. ముందుగా సాగు చేసిన ఖరీఫ్ పంటలకు ఊరటనిస్తుండగా ‘ప్రత్యామ్నాయ’ పంటల సాగుకు అనుకూలమని శాస్త్రవేత్తలు, అధికారులు తెలిపారు. అయితే, ప్రత్యామ్నాయంలో రైతులకు విత్తన సమస్య ఎదురవుతోంది. వ్యవసాయశాఖ ఇంకా ప్రణాళిక సిద్ధం చేయకపోవడంతో ఇప్పట్లో రాయితీ విత్తనం అందే పరిస్థితి కనిపించడం లేదు. కీలకమైన జూన్, జూలైలో నెలన్నర రోజుల పాటు సరైన వర్షాలు లేకపోవడంతో 50 శాతం వరకు భూములు బీళ్లుగానే దర్శనమిస్తున్నాయి.లేకలేక వర్షాలు కురవడంతో ప్రత్యామ్నాయ సాగుకు సిద్ధంగా ఉన్నా కంది, ఉలవ, పెసర, అలసంద, కొర్ర, సజ్జ, పొద్దుతిరుగుడు తదితర విత్తనాల కోసం రైతులు ఎదురుచూస్తున్నారు
జిల్లాకు 1,571 మెట్రిక్ టన్నుల ఎరువులు
అనంతపురం అగ్రికల్చర్: జిల్లాకు 1,571 మెట్రిక్ టన్నుల ఎరువులు సరఫరా అయినట్లు రేక్ ఆఫీసర్, ఏడీఏ జీఎం అల్తాఫ్ అలీఖాన్ తెలిపారు. బుధవారం స్థానిక ప్రసన్నాయపల్లి రైల్వేస్టేషన్ రేక్‌పాయింట్‌కు వ్యాగన్ల ద్వారా చేరిన ఎరువులను ఆయన పరిశీలించారు. స్పిక్ కంపెనీ నుంచి 754 మెట్రిక్ టన్నుల యూరియా, 407 మెట్రిక్ టన్నుల డీఏపీ, 410 మెట్రిక్ టన్నుల 20–20–0–13 రకం కాంప్లెక్స్ ఎరువులు వచ్చాయన్నారు. జేసీ ఆదేశాల మేరకు ఇందులో 352 మెట్రిక్ టన్నుల యూరియాను మార్క్‌ఫెడ్‌కు, మిగిలిన 402 మెట్రిక్ టన్నులను ప్రైవేట్ డీలర్లకు కేటాయించినట్లు తెలిపారు.

వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోండి