శింగనమల: పుట్టిన బిడ్డకు తల్లి పాలే శ్రేయస్కరమని ఐసీడీఎస్ పీడీ నాగమణి అన్నారు. గురువారం తల్లి పాల వారోత్సవాల్లో భాగంగా శింగనమలలో అంగన్‌వాడీ కార్యకర్తలు ర్యాలీ చేపట్టి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐసీడీఎస్ పీడీ నాగమణి మాట్లాడుతూ బిడ్డ పుట్టినప్పటి నుంచి 6 నెలల వరకు తల్లి పాలు ఇవ్వాలన్నారు. ఆ తరువాత తల్లి పాలతో పాటు పోషకాహారం అందించాలని చెప్పారు. గర్భిణులు, బాలింతలు అంగన్‌వాడీ కేంద్రాలను వినియోగించుకోవాలన్నారు. ఆగస్టు 12న నులిపురుగుల నివారణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సీడీపీఓ లలితమ్మ, సూపర్ వైజర్లు తదితరులు పాల్గొన్నారు.
కేజీబీవీ టీచర్లకు ముగిసిన శిక్షణ
అనంతపురం ఎడ్యుకేషన్: కేజీబీవీ టీచర్లకు శిక్షణ కార్యక్రమం ముగిసింది. తొమ్మిది జిల్లాల పరిధిలోని కేజీబీవీ హిందీ, ఉర్దూ టీచర్లకు బుక్కరాయసముద్రం సమీపంలోని శ్రీ భారతి డీఎడ్ కళాశాలలో ఈ నెల 3 నుంచి శిక్షణ ఇస్తున్నారు. గురువారం ముగింపు కార్యక్రమానికి జిల్లా విద్యాశాఖ అధికారి ఎం. ప్రసాద్ బాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ శిక్షణలో తెలుసుకున్న అంశాలను బాగా అర్థం చేసుకొని విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని కోరారు. కేజీబీవీల్లో చదువుకుంటున్న అనాథ, పేద ఆడబిడ్డలను సొంత పిల్లలుగా చూడాలని కోరారు. అడ్మిషన్లు పెంచడానికి కూడా కృషి చేయాలన్నారు. జీసీడీఓ కవిత మాట్లాడుతూ శిక్షణలో అనంతపురం, శ్రీ సత్యసాయి, నెల్లూరు, వైఎస్సార్, కర్నూలు నంద్యాల, అన్నమయ్య, తిరుపతి, చిత్తూరు జిల్లాల నుంచి 192 మంది హిందీ, ఉర్దూ టీచర్లు హాజరయ్యారన్నారు. అనంతరం రిసోర్స్ పర్సన్లను సన్మానించారు.
వెరిఫికేషన్‌కు రాలేదు.. మీ పెన్షన్ నిలిపివేస్తున్నాం
● కనికరం లేకుండా అంధుల పింఛన్లు
ఆపివేసిన కూటమి సర్కారు
అనంతపురం అర్బన్: కూటమి ప్రభుత్వంలో పేదలను కష్టాలు వెంటాడుతున్నాయి. వెరిఫికేషన్‌కు హాజరవ్వలేదనే కారణంగా అంధులకు పింఛను నిలిపివేసిన ఘటన కుందుర్పి మండలం మలయనూరులో చోటు చేసు కుంది. ఈ క్రమంలో తమ గోడు కలెక్టర్‌కు చెప్పుకునేందుకు గురువారం బాధిత అంధులు సంకప్ప, ఆంజనేయులు, లక్ష్మమ్మ, మల్లేష్, చెన్నక్క, మహితలు కలెక్టరేట్‌కు వచ్చారు. అయితే ఉన్నతాధికారులు అందుబాటులో లేకపోవడంతో నిరాశగా వెనుతిరిగారు.
వారు మాట్లాడుతూ తమ గ్రామంలో 17 మందికి పింఛను నిలిపివేశారన్నారు. పునఃపరిశీలనకు కోసం ఈ ఏడాది ఫిబ్రవరి 25న అనంతపురంలోని ప్రభుత్వ సర్వజన ఆస్పత్రికి రావాలని నోటీసు ఇచ్చారన్నారు. అయితే వెళ్లాల్సిన పనిలేదంటూ సచివాలయ ఉద్యోగి గంగాధర్ చెప్పడంతో తాము మిన్నకుండిపోయామన్నారు. తీరా చూస్తే ఈనెల పింఛను నిలిపివేశారని ఆవేదన వ్యక్తం చేశారు. పెన్షన్ డబ్బే ఆసరా అని, అది కూడా నిలిచిపోతే తాము ఎలా బతకాలని వాపోయారు.

తల్లి పాలే బిడ్డకు శ్రేయస్కరం