
ఆస్పత్రిలో ఏం జరుగుతోంది?
అనంతపురం మెడికల్: రాష్ట్రంలోనే ఏ జిల్లాలో లేని విధంగా అనంతపురం ప్రభుత్వ సర్వజనాస్పత్రిలో వైద్య ప్రమాణాలు దారుణంగా దిగజారాయి. వైద్యా రోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ సొంత ఇలాకాలోని పెద్దాస్పత్రిలోనే దుస్థితి నెలకొనడం నిత్యం చర్చనీయాంశమవుతోంది. ఆస్పత్రి అధికారుల నిర్లక్ష్యంతో అమాయక రోగులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఇటీవల ఆస్పత్రిలో స్ట్రెచర్ అందుబాటులో లేక మధునాయక్ (23) అనే యువకుడు మృతి చెందిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. గత నెలలో ఆర్థో వార్డులో వైద్యుల నిర్లక్ష్యంతో 22 ఏళ్ల రాజేష్ మరణం కలకలం రేపింది. సూపరింటెండెంట్ సొంత ఆస్పత్రి అయిన మేడా నర్సింగ్ హోంలో అడ్మిషన్ పొంది జీజీహెచ్‌లో వైద్యుల నిర్లక్ష్యం కారణంగా రాజేష్ ప్రాణాలు కోల్పోయిన విషయం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.దీనికితోడు వైద్యులు సమయ పాలన పాటించకపోవడం, స్టాఫ్‌నర్సులకు విధుల కేటాయింపుల్లో నర్సింగ్ సూపరింటెండెంట్ బాధ్యతారాహిత్యం, రోగులను సకాలంలో గమ్యస్థానాలకు చేర్చలేని స్థితిలో సిబ్బంది ఉండడం, ఓపీల్లో వైద్యులు విధులకు డుమ్మా కొట్టడం, కాలిన గాయాల వారికి కేటాయించిన వార్డును ఈఎన్‌టీకి కేటాయించడం తదితర విషయాలపై ‘సాక్షి’లో ఇటీవల వరుస కథనాలు ప్రచురితమయ్యాయి. ఈ క్రమంలో ఇన్‌చార్జ్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ స్పందించారు. అసలు ఆస్పత్రిలో ఏం జరుగుతోందంటూ ఆరా తీశారు. ఆస్పత్రిని తనిఖీ చేసి సమగ్ర నివేదిక సమర్పించాలని అసిస్టెంట్ కలెక్టర్ సచిన్ రహన్‌ను ఆదేశించారు. దీంతో గురువారం అసిస్టెంట్ కలెక్టర్ సచిన్ సర్వజనాస్పత్రిని ఆకస్మిక తనిఖీ చేశారు. పలు వార్డులను పరిశీలించారు. అక్యూట్ మెడికల్ కేర్, ఐసీయూల్లో ఏసీలు పూర్తిగా పని చేయడం లేదని తెలుసుకున్నారు. ఆస్పత్రిలో రోగులకందుతున్న సేవల్లో నాణ్యతా ప్రమాణాలు ఏమాత్రం లేవని గుర్తించినట్లు సమాచారం.కాగా, సాధారణ రోజుల్లో మధ్యాహ్నం 2 గంటలకే ఇళ్లకు పరుగులు తీసే వైద్యులు అసిస్టెంట్ కలెక్టర్ వస్తున్నారని తెలిసి ఆస్పత్రిలోనే ఉండడం గమ నార్హం. మధ్యాహ్నం ఓపీ సమయంలోనూ పలు విభాగాల్లో పీజీ వైద్యులు ఉండడం కనిపించింది.
ఇన్‌చార్జ్ కలెక్టర్ ఆరా..
సమగ్ర నివేదిక ఇవ్వాలని
అసిస్టెంట్ కలెక్టర్‌కు ఆదేశం