
పచ్చ గద్దల కబ్జాపర్వం
అనంతపురం క్రైం: అనంతపురంలో ‘పచ్చ’ గద్దల కబ్జా పర్వం ఆగడం లేదు. అధికార పార్టీ ప్రజా ప్రతినిధి సారథ్యంలో ప్రైవేటు సైన్యం సాగిస్తున్న అకృత్యాలతో సామాన్యులు విలవిలలాడుతున్నారు. ‘పచ్చ’ ముఠాకు పోలీసు యంత్రాంగం అండగా నిలుస్తుండడంతో బాధితులు కుమిలిపోతున్నారు. తాజాగా మైనార్టీ కుటుంబానికి చెందిన, అప్పటికే మార్ట్‌గేజ్ చేసిన స్థలాన్ని సైతం వదలకుండా అక్రమంగా తమ పేరున రిజిస్ట్రేషన్ చేయించుకున్న వైనం కలకలం రేపుతోంది. వివరాలు.. అనంతపురంలోని సాయినగర్ 6వ క్రాస్‌లో మైనార్టీ కుటుంబానికి ఆప్టికల్ షాపు ఉంది. 2024లో ఈ స్థలాన్ని ప్రదీప్ అనే వ్యక్తి నుంచి వారు కొనుగోలు చేశారు. అనంతరం బ్యాంకులో మార్ట్‌గేజ్ చేయించారు. ఇటీవల అదే స్థలాన్ని మరొకరి పేరుపై రిజిస్ట్రేషన్ చేసి ఉండడం గుర్తించిన బాధితులు రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్లి నేరుగా డీఐజీకి ఫిర్యాదు చేశారు. కానీ, డీఐజీ మాత్రం ‘పోలీసు కేసు పెట్టండి.. ఇక్కడ ఫిర్యాదు చేస్తే ఉపయోగం ఉండదు’ అని చెప్పడంతో గురువారం కలెక్టరేట్‌లో ఫిర్యాదు చేసేందుకు బాధితురాలు సౌమ్య వచ్చారు. తమకు తెలియకుండా టీడీపీకి చెందిన కొంత మంది మరొకరి పేరున స్థలం రిజిస్ట్రేషన్ చేయించారని విలేకరులతో వాపోయారు. రిజిస్ట్రార్ రమణరావుకు ఫిర్యాదు చేస్తే ఎమ్మెల్యే బంధువుల ఒత్తిడి చాలా ఉందని చెబుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఖాళీ జాగా కనిపిస్తే పాగానే..
అనంతపురంలో ప్రజా ప్రతినిధి సారథ్యంలోని ప్రైవేటు సైన్యం యథేచ్ఛగా భూ కబ్జాలకు పాల్పడుతోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. వారం రోజుల క్రితం అనంతపురం నగర శివారు 210 సర్వే నంబరులోని ఏడెకరాల భూమిలో ప్రజాప్రతినిధికి అత్యంత సన్నిహితులైన కొంత మంది కంచె వేశారు. రూ. కోట్లు విలువైన భూమిని కాజేయాలని ముఠా పక్కాగా ప్రణాళిక సైతం రూపొందించడం కలకలం రేపింది. ఇటీవల అనంతపురం రూరల్ పరిధి కక్కలపల్లి గ్రామ పొలంలోని సర్వే నంబరు 242 భూమిలోకి ‘పచ్చ’ రౌడీలు బలవంతంగా ప్రవేశించేందుకు యత్నించగా యజమానులు అడ్డుకున్నారు. అయితే, కబ్జారాయుళ్లు సదరు భూమి యజమాని వెంకటేశ్వరప్రసాద్‌తో పాటు అతని కుమారుడు ప్రణీత్ సాయిపై దాడి చేశారు. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేక పోయింది. అలాగే, ఇదే గ్రామ పొలంలోని సర్వేనంబరు 144–2ఏ, 2బీలో విజయలక్ష్మి అనే మహిళతో పాటు మరి కొంత మందికి చెందిన ఇళ్ల స్థలాలకు సరిహద్దుగా ఏర్పాటు చేసుకున్న గోడలను కూల్చేసి, బోరు బావులను ధ్వంసం చేశారు. నగరంలోని శారదా నగర్‌కు చెందిన 242 సర్వే నంబరులోని మూడున్నర సెంట్ల స్థలంలోకి అక్రమంగా చొరబడాలని చూశారు. ఈ క్రమంలో ఇరువర్గాలు పరస్పరం దాడి చేసుకున్నాయి. ఇలా నగరంలో కనిపించిన ప్రతి ఖాళీ జాగాలోనూ పాగా వేస్తుండడంతో ప్రజలు భయకంపితులవుతున్నారు. పోలీసులు సైతం పచ్చ మూకకే వత్తాసు పలుకుతుండడంతో అల్లాడిపోతున్నారు.
ప్రజా ప్రతినిధి కనుసన్నల్లో
రెచ్చిపోతున్న ప్రైవేటు సైన్యం
తాజాగా ఓ మైనార్టీ కుటుంబానికి చెందిన స్థలం అక్రమ రిజిస్ట్రేషన్