
హామీలిచ్చి ఉరితాళ్లు బిగిస్తారా?
అనంతపురం అర్బన్: ఎన్నికల ముందు అనేక హామీలిచ్చి అధికారంలోకి వచ్చాక అమలు చేయకుండా నేత కార్మికులకు ఉరితాళ్లు బిగిస్తారా అంటూ చేనేత సంఘం నాయకులు మండిపడ్డారు. ప్రతి చేనేత కుటుంబానికి తక్షణం రూ.36 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. హామీలు అమలు చేయాలంటూ ఏపీ చేనేత సంఘం ఆధ్వర్యంలో నాయకులు, నేత కార్మికులు గురువారం స్థానిక కృష్ణకళామందిర్ నుంచి క్లాక్‌టవర్ వద్ద ఉన్న చేనేత శాఖ ఏడీ కార్యాలయం వరకూ ర్యాలీ నిర్వహించారు. అక్కడ నేత కార్మికులు మెడకు ఉరితాళ్లు తగిలించుకుని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు శ్రీరాములు, గోవిందు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాదైనా చేనేత కార్మికులకు చేసిందేమీ లేదన్నారు. చేనేతలను ఉద్ధరిస్తున్న ట్లుగా జాతీయ చేనేత దినోత్సవాన్ని ప్రభుత్వం జరపుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. బడ్జెట్‌లో చేనేత సంక్షేమానికి రూ.1,000 కోట్లు కేటాయిస్తామని చెప్పి విస్మరించారన్నారు. ఆత్మహత్య చేసుకున్న కార్మికుల కుటుంబాలకు రూ.7 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇస్తామని చెప్పినా అమలు చేయలేదన్నారు. గిట్టుబాటు ధరలు కల్పించి వలసలు, ఆత్మహత్యలు నివారించాలన్నారు. కార్మికులు నేసిన చీరలను ప్రభుత్వమే కొనుగోలు చేయాలన్నారు. సమస్యలు పరిష్కరించుకుంటే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో చేతి వృత్తిదారుల సమాఖ్య రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి లింగమయ్య, చేనేత సంఘం నాయకులు పురుషోత్తం, చింతా వెంకటరమణ, చింతా పురుషోత్తం, శేఖర్, ఎర్రిస్వామి, లక్ష్మీనారాయణ, రామాంజి తదితరులు పాల్గొన్నారు.
కూటమి ప్రభుత్వంపై
చేనేతల మండిపాటు