మేసినోళ్ల గుండెల్లో రైళ్లు! | - | Sakshi
Sakshi News home page

మేసినోళ్ల గుండెల్లో రైళ్లు!

Aug 7 2025 7:42 AM | Updated on Aug 7 2025 7:54 AM

మేసినోళ్ల గుండెల్లో రైళ్లు!

మేసినోళ్ల గుండెల్లో రైళ్లు!

అనంతపురం సెంట్రల్‌: ఏసీబీ కేసుల్లో నిందితులుగా ఉన్న రవాణాశాఖ అధికారుల్లో గుబులు రేగుతోంది. ఇటీవల అనంతపురం రవాణా శాఖ కార్యాలయంలో పనిచేస్తున్న ఓ అధికారిని ఉద్యోగం (రిమూవ్‌ ఫ్రం సర్వీస్‌) నుంచి తొలగించడం అవినీతి అధికారులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఉమ్మడి జిల్లాలోనూ పలువురిపై వేటు తప్పదని ఊహాగానాలు రేగడంతో ఎప్పుడు ఎవరిపై వేటు పడుతుందోననే ఆందో ళనలో బిక్కుబిక్కుమంటున్నారు. ప్రభుత్వానికి ఆదాయం తీసుకొచ్చే వాటిలో రవాణా శాఖ కీలకమైంది. ఇదే అదునుగా కొందరు అధికారులు అక్రమాలకు పాల్పడుతున్నారు. మేసినంత మేస్తున్నారు. అలాంటి లంచావతారులపై అనేక సందర్భాల్లో అవినీతి నిరోధకశాఖ అధికారులు వలపన్ని పట్టుకున్నారు. జిల్లాలో ఒకే ఏడాదిలో రెండు,మూడు సార్లు దాడులు జరిగిన దాఖలాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా పెనుకొండ సమీపంలో రవాణా శాఖ చెక్‌పోస్టు ఉన్న సమయంలో ఏసీబీ దాడులు సర్వసాధారణంగా ఉండేవి. అలా దాడులు జరపడం... ఇలా అవినీతి అధికారులను పట్టుకోవడం అన్న చందాన ఉండేదంటే అతిశయోక్తి కాదు. ఏసీబీ కేసుల్లో ఇప్పటికీ అనేక మంది ఉద్యోగులు కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు.

చర్యలకు ఉపక్రమణ..

లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టుబడిన, ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టిన అధికారులపై రవాణాశాఖ ఉన్నతాధికారులు ఇటీవల చర్యలకు ఉపక్రమించారు. ఈ విషయంలో రవాణా శాఖ కమిషనర్‌ సీరియస్‌గా ఉన్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే ఇటీవల జిల్లా కేంద్రంలో పనిచేస్తున్న ఓ ఏఎంవీఐని ఏకంగా సర్వీసు నుంచి తొలగించారు. గతంలో ఏసీబీకి పట్టుబడిన ఓ అధికారి ఇటీవల కర్నూలు జిల్లా నుంచి ఇక్కడికి రాగా పవర్స్‌ ఇవ్వకుండా ఉంచారు. ఆరు నెలలు దాటినా తిరిగి అధికారాలు పునరుద్ధరించకపోవడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఇలాంటి అధికారులు రాష్ట్ర వ్యాప్తంగా 25 మందికిపైగా ఉన్నట్లు సమాచారం. గతంలో జిల్లా కేంద్రంలో ఇద్దరు ఎంవీఐలు, ఓ ఏఎంవీఐ లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు. అలాగే శ్రీసత్యసాయి జిల్లాలో కూడా ఇద్దరు ఎంవీఐలు, ఓ చిన్న స్థాయి సిబ్బంది ఉన్నట్లు తెలిసింది. ప్రస్తుతం వీరందరి గుండెల్లో రైళ్లు పరుగెత్తుతున్నట్లు సమాచారం.

హోంగార్డుల్లో కంగారు..

రవాణా శాఖలో డిప్యుటేషన్‌పై పనిచేసే పోలీసు శాఖకు చెందిన హోంగార్డులు కూడా అనేక సందర్భాల్లో ఏసీబీకి పట్టుబడ్డారు. దీంతో ఒకరిద్దిని ఇప్పటికే ఉద్యోగం నుంచి తొలగిస్తూ (రిమూవ్‌ ఫ్రం సర్వీస్‌) నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలోనే కొంతమంది కోర్టును ఆశ్రయించారు. పై అధికారులు చెబితేనే తాము చేశాం.. చిరుద్యోగులం.. తమపై ఏసీబీ కేసులు తొలగించాలంటూ న్యాయస్థానాన్ని అభ్యర్థించారు. ఈ అంశంపై కూడా త్వరలో ఉత్తర్వులు వచ్చే అవకాశముందని అధికార వర్గాల ద్వారా తెలిసింది.

వీఆర్‌ఎస్‌.. వద్దులే!

ఉన్నతాధికారుల చర్యల నుంచి బయటపడేందుకు కొంతమంది స్వచ్ఛంద పదవీ విరమణ (వలంటరీ రిటైర్మెంట్‌) చేయాలని భావిస్తున్నట్లు తెలిసింది. అయితే పదవీ విరమణ అయినప్పటికీ ఏసీబీ కేసుల్లో ఉన్న అధికారులకు ప్రభుత్వం నుంచి రావాల్సిన బెనిఫిట్స్‌ రావని తెలియడంతో మిన్నకుండిపోతున్నారు. ఏదీ ఏమైనా రవాణాశాఖ అధికారులకు ఏసీబీ భయం కంటి మీద కునుకులేకుండా చేస్తోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ఆర్టీఏ అధికారుల్లో ‘ఏసీబీ’ గుబులు

ఇప్పటికే ఓ ఏఎంవీఐను

సర్వీస్‌ నుంచి తొలగింపు

ఉమ్మడి జిల్లాలోనూ పలువురిపై వేటు తప్పదని ఊహాగానాలు

వణికిపోతున్న ఏసీబీ కేసులున్న అధికారులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement