
ప్రాణాలు పోతే తప్ప స్పందించరా?
ఉరవకొండ: ‘మా ప్రాణాలు పోతే తప్ప స్పందించరా?’ అంటూ విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారుల అలసత్వాన్ని నిరసిస్తూ ఉరవకొండలో బుధవారం 200 మంది మోడల్ స్కూల్ విద్యార్థులు రోడ్డెక్కారు. ప్రధాన రహదారిపై గంటకు పైగా రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ చిన్నముస్టూరులోని మోడల్ స్కూల్‌కు రోజూ ఉరవకొండ నుంచి 200 మంది వరకు వెళ్తున్నామన్నారు. ఆర్టీసీ వారు కేవలం ఒక బస్సే నడుపుతుండటంతో తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోందన్నారు. అధ్వానంగా ఉన్న మోడల్ స్కూల్ మట్టి రోడ్డులో ప్రయాణం నరకంగా మారిందన్నారు. తల్లిదండ్రులతో కలిసి తమ బాధలను అధికారులతో ఎన్నో సార్లు మొర పెట్టుకున్నా స్పందించడం లేదన్నారు. ఏదైనా ప్రమాదం జరిగి తమ ప్రాణాలు పోతే తప్ప అధికారులు స్పందించేలా లేరని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. దాదాపు గంట పాటు ఆర్టీసీ డిపో ఎదుట ప్రధాన రహదారిపై రాస్తారోకో చేయడంతో ట్రాఫిక్ స్తంభించిపోయింది. ఈ క్రమంలో ఎస్‌ఐ జనార్దన్ నాయుడు, ఆర్టీసీ డీఎం హంపన్నలు విద్యార్థుల వద్దకు చేరుకుని మాట్లాడారు. తమ వద్ద ఆర్టీసీ సర్వీసులు లేవని, కేవలం ఒక్క బస్సు మాత్రమే నడపగలమని డీఎం తెలిపారు. సర్వీసులు అదనంగా వస్తే నడుపుతామని చెప్పారు. డీఎం సమాధానంపై విద్యార్థులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే ఎస్‌ఐ మాట్లాడుతూ అదనంగా మరో బస్సు ఏర్పాటు చేసేలా మాట్లాడతామని చెప్పడంతో విద్యార్థులు ఆందోళన విరమించారు.
ఉరవకొండలో రోడ్డెక్కిన
మోడల్ స్కూల్ విద్యార్థులు