
రౌడీయిజం బాబు నైజం
● ఎమ్మెల్సీ రమేష్‌పై దౌర్జన్యం అప్రజాస్వామికం
● వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి
అనంతపురం కార్పొరేషన్: కూటమి ప్రభుత్వంలో రౌడీయిజం, దౌర్జన్యం రాజ్యమేలుతోందని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి మండిపడ్డారు. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికలో భాగంగా ప్రచారానికి వెళ్లిన ఎమ్మెల్సీ రమేష్ యాదవ్‌పై దాడి చేయడాన్ని ఆయన తప్పుబట్టారు. ‘అనంత’ బుధవారం ‘సాక్షి’తో మాట్లాడారు. దౌర్జన్యాలు ఎక్కువ రోజులు సాగవని, ఇప్పటికే చంద్రబాబు సర్కార్‌పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఏర్పడిందని పేర్కొన్నారు. ప్రజల నుంచి తిరుగుబాటు తథ్యమని స్పష్టం చేశారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను పూర్తిగా అమలు చేయకుండా ప్రజలను చంద్రబాబు మోసం చేశారన్నారు. రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా కూటమి ప్రభుత్వంలో దారుణమైన పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయన్నారు. ప్రజాస్వామ్య పద్ధతిలో గెలవలేక, ఎన్నికల్లో ప్రజలను భయభ్రాంతులకు గురి చేసేందుకు దాడులకు యత్నిస్తున్నారని ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వం ఎన్ని దౌర్జన్యాలు, దాడులకు పాల్పడినా అంతిమ గెలుపు వైఎస్సార్ సీపీదేనన్నారు. తమ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిపై ప్రజలకు అపార విశ్వాసం ఉందన్నారు. కూటమి ప్రభుత్వం ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా భయపడే ప్రసక్తి లేదన్నారు. ఎన్నికల్లో గెలవమని తెలిసే దౌర్జన్యాలకు పాల్పడుతున్నారన్నారు. ప్రజలన్నీ గమనిస్తున్నారని, ప్రజాస్వామ్య పద్ధతిలో తాము తగిన బుద్ధి చెబుతామన్నారు. చంద్రబాబు భవిష్యత్తులో మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు.