
తప్పును కప్పిపుచ్చుకునేందుకు వక్రభాష్యం
అనంతపురం మెడికల్: తన తప్పును కప్పిపుచ్చుకునేందుకు రోగి మృతిపై వక్రభాష్యం పలికారు సర్వజనాస్పత్రి సూపరింటెండెంట్ ఆత్మారాం. రోగులకు మెరుగైన వైద్య సేవలందేలా చూడాల్సిన బాధ్యతల్లో ఉండీ, ఎక్కడైనా జాప్యం జరిగితే వెంటనే తగిన చర్యలు తీసుకోవాల్సింది పోయి నిర్లక్ష్యంగా సమా ధానం ఇవ్వడం వివాదాస్పదమవుతోంది. వివరాలు.. ఈ నెల 5న సర్వజనాస్పత్రిలో స్ట్రెచర్ అందుబాటులో లేక బెళుగుప్ప తండాకు చెందిన మధునాయక్ (23) ప్రాణాలు వదిలాడు. ఆస్పత్రిలో ఆల్ట్రాసౌండ్ స్కాన్ గది ముందే కుప్పకూలి మృతి చెందాడు. దీనిపై బుధవారం ‘సాక్షి’లో కథనం వెలువడగా.. ఇందుకు సమాధానంగా సూపరింటెండెంట్ డాక్టర్ ఆత్మారాం నుంచి వచ్చిన సందేశం నివ్వెరపోయేలా చేసింది. 23 ఏళ్ల మధు నాయక్ తాగుబోతు అని, లివర్ ఫెయిల్ అయ్యిందని అందులో తెలిపారు. చిన్నతనంలోనే తాగుబోతు అయినందుకు బాధేస్తోందని సెలవిచ్చారు. ప్రమాదకర మద్యాన్ని కొన్నేళ్లుగా ఎలా తీసుకుంటున్నాడో అంటూ పేర్కొనడం గమనార్హం. ఆస్పత్రిలో స్ట్రెచర్లు లాంటి మౌలిక వసతులు కూడా రోగులకు అందుబాటులో లేని తరుణంలో సౌకర్యాలను మెరుగుపరచి, సేవలు సరిగా అందేలా చూడాల్సిన ఓ అధికారి.. తన తప్పును కప్పిపుచ్చుకునేందుకు రోగి స్వీయ తప్పిదంతోనే మరణించాడంటూ పేర్కొనడం ఆయన నైతికతకు అద్దం పడుతోంది.
‘స్ట్రెచర్ ఉన్నా బతకడు’
ఇదే విషయంపై ఆస్పత్రి అడ్మినిస్ట్రేటర్ మల్లికార్జున రెడ్డి చెప్పిన మాటలు వింటే ఎవరైనా విస్తుపోవాల్సిందే. మధు నాయక్ విపరీతంగా తాగుడుకు బానిసయ్యాడని, చివరి అంకంలో ఆస్పత్రికి వచ్చాడని, స్ట్రెచర్‌తో తీసుకెళ్లినా బతకడంటూ ఆయన పేర్కొనడం చూస్తే సామాన్య ప్రజలపై ఎలాంటి అభిప్రాయం ఉందో అర్థం చేసుకోవచ్చు.
వ్యక్తి మృతిపై సూపరింటెండెంట్ నిర్లక్ష్యపు సమాధానం